హనీ ట్రాప్.. మరో టీడీపీ కీలక నేత అరెస్ట్

హనీ ట్రాప్.. మరో టీడీపీ కీలక నేత అరెస్ట్

ఏపీలో సంచ‌ల‌నం రేపుతున్న‌ ‘హనీ ట్రాప్’ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అమాయకులను, సంపన్నులను లక్ష్యంగా చేసుకుని మహిళలను ఎరగా వేసి, కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న ఈ ముఠాలో రాజకీయ నేతల ప్రమేయం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుల మూలాలన్నీ అధికార తెలుగుదేశం పార్టీ నుంచి బ‌య‌ట‌ప‌డుతుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు తాజాగా రుద్రంపేట ప్రాంతానికి చెందిన టీడీపీ కీల‌క నాయ‌కుడు నరేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఈ ముఠాకు మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న రంగమ్మ నాయుడు (చిన్ని నాయుడమ్మ) తో పాటు రాజేష్ నాయుడు, జయలక్ష్మి, మల్లేశ్వరి వంటి వారు పోలీసు కస్టడీలో ఉన్నారు. వీరిలో ప్ర‌ధాన నిందితులు పోలీసులు పేర్కొన్న రంగ‌మ్మ నాయుడు, రాజేష్ నాయుడు, న‌రేంద్ర‌రెడ్డిలు టీడీపీకి చెందిన వారని, అందుకు సంబంధించిన ఆధారాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మోసపోయిన బాధితులు
పోలీసుల కథనం ప్రకారం, ఈ ముఠా పక్కా ప్లాన్‌తో కార్యకలాపాలు సాగిస్తోంది. ఫోన్ కాల్స్ లేదా సర్వేల పేరుతో మహిళల ద్వారా బాధితులకు వల వేస్తారు. వారిని ఏకాంత ప్రదేశాలకు రప్పించి, న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారు. పరువు పోతుందనే భయంతో బాధితుల నుంచి లక్షల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పటివరకు సుమారు 20 మందిని ట్రాప్ చేసి దాదాపు కోటి రూపాయలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసు అధికారులపై వేటు
ఈ హనీ ట్రాప్ ముఠాకు కొందరు పోలీసు అధికారులు సహకరించినట్లు వచ్చిన ఆరోపణలు నిజమని తేలడం గమనార్హం. డబ్బు వసూళ్లలో కీలక పాత్ర పోషించినట్లు తేలడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం త్రీ టౌన్ సీఐ రాజేంద్ర నాథ్ యాదవ్‌ను విఆర్ (VR) కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీరితో పాటు సుమారు 10 మంది కానిస్టేబుళ్ల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.

రాజకీయ దుమారం
ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందనే వార్తలు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. నిందితులకు అండగా ఉండటమే కాకుండా, కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల వద్ద నిందితుల నుండి రూ. 13 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయోనని జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment