కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం చార్మినార్ సమీపంలోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమిత్ షా వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆలయ సందర్శన అనంతరం ఆయన ఐటీసీ కాకతీయ హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ భోజన విరామం తర్వాత పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్, పారిశ్రామికవేత్త మై హోం రామేశ్వరరావు కూడా అమిత్ షాతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక సమాచారం వెలువడలేదు.
మరోవైపు, సాయంత్రం 4 గంటల తర్వాత నిజాం కళాశాల మైదానం సమీపంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమయ్యే మహా పాదయాత్రలో అమిత్ షా పాల్గొననున్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు చేపట్టిన ర్యాలీకి ప్రతిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. పాదయాత్రలో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సన్నాహాలు చేపట్టింది.








