ప్ర‌శ్నిస్తే.. ప‌వ‌న్ అభిమానుల‌ సైబ‌ర్ దాడి

ప్ర‌శ్నిస్తే.. ప‌వ‌న్ అభిమానుల‌ సైబ‌ర్ దాడి

Summarize with AI

డిజిటల్ యుగంలో శక్తివంతమైన సోష‌ల్ మీడియా, ప్ర‌స్తుతం భిన్నాభిప్రాయాలను అణచివేసే ఒక ప్రమాదకరమైన ఆయుధంగానూ మారుతోందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) అనుభవించిన సైబర్ వేధింపులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్‌ను (Pawan Kalyan) ఉద్దేశించి పరిపాలన(Governance, పారదర్శకతపై (Transparency) రాహుల్ అడిగిన కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో దావాగ్నిలా మారాయి. చివరికి జనసైనికులు, పవన్ అభిమానుల నుంచి వ్యక్తమైన మితిమీరిన ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలను తట్టుకోలేక ఆయన ఆ ట్వీట్లను డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇది కొత్తేం కాదు, ఇటీవ‌ల ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు (Professor Nageswara Rao) విష‌యంలో, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌Prakash Raj), మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) విష‌యంలోనూ ప‌వ‌న్ అభిమానుల తీరు ఇలాగే ఉందంటున్నారు.

ప్ర‌శ్నించేందుకు పెట్టిన పార్టీ.. ప్ర‌జ‌లు, ప్ర‌ముఖుల నుంచి ఎదుర‌య్యే ప్ర‌శ్న‌ల‌ను మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా ఎదురుదాడి చేయ‌డం శోచ‌నీయం. సమాజంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే రాహుల్ రామకృష్ణ.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్న శాఖలపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. సమాచార హక్కు చట్టం (RTI Act) లోని సెక్షన్ 4.1(బి) ప్రకారం మీ శాఖలలో ముందస్తు సమాచార వెల్లడి ఎందుకు జరగడం లేదు? గిరిజన ప్రాంతాల్లో(Tribal Areas) ‘పెసా’ చట్టాన్ని (PESA Act) ఎలా అమలు చేస్తున్నారు? అంటూ ఆయన నిలదీశారు. చివరలో రాహుల్ “జై తెలంగాణ” (Jai Telangana) అని రాయడం అసలు వివాదానికి కారణమైంది.

ఇటీవల తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలతో ఈ నినాదాన్ని ముడిపెడుతూ.. పవన్ అభిమానులు కొంద‌రు దీనిని రెండు ప్రాంతాల మధ్య వైరంగా మార్చే ప్రయత్నం చేశారు. రాహుల్‌పై కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ట్విట్టర్ వేదికగా తనపై జరుగుతున్న ముకుమ్మడి దాడిని రాహుల్ రామకృష్ణ మొదట్లోనే “ప్రశ్నించినంత మాత్రాన నేను దేశద్రోహిని కాను” అంటూ గట్టిగానే బదులిచ్చారు.

కానీ, సమయం గడుస్తున్న కొద్దీ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహం ప‌రిధులు దాటి ట్రోలింగ్ కాస్తా వ్యక్తిగత దూషణలుగా, తీవ్రమైన సైబర్ దాడిగా రూపాంతరం చెందింది. ఈ మానసిక ఒత్తిడిని భరించలేక.. “నా వల్లనే ప్రాబ్లెమ్ అంటే వెళ్ళిపోతా మావా” అంటూ ట్వీట్ చేసిన రాహుల్, చివరికి పవన్‌ను ప్రశ్నించిన ట్వీట్లన్నింటినీ తన టైమ్‌లైన్ నుండి పూర్తిగా తొలగించారు. ప్ర‌శ్నిస్తే ఇంత‌టి దారుణ‌మైన దూష‌ణ‌లు ఉంటాయా..? ఇంట్లో వాళ్ల‌ను సైతం లాగి దారుణంగా మాట్లాడుతారా..? జ‌న‌సైనికులు, ప‌వ‌న్ ఫ్యాన్స్ మాట‌ల‌కు హ‌ద్దూ, అదుపు ఉండదా..? అని నెటిజ‌న్లు సైతం నివ్వెర‌పోతున్నారు. ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌రావు విష‌యంలోనూ, ఆ త‌రువాత మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ విష‌యంలోనూ, న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌ విష‌యంలోనూ ఈ విధ‌మైన వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల దాడే జ‌రిగింద‌ని గుర్తుచేస్తున్నారు.

ఒక నాయకుడిని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సింది పోయి, ఒక గుంపుగా ఏర్పడి సదరు వ్యక్తిని మానసికంగా కుంగదీసేలా సైబర్ దాడులకు దిగడం అత్యంత ప్రమాదకరమైన ట్రెండ్‌కు దారితీస్తుందని రాజ‌కీయ విశ్లేష‌కులు హెచ్చరిస్తున్నారు. సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తికే ఈ స్థాయిలో ట్రోలింగ్ ఎదురైతే.. ఇక సామాన్య పౌరుడు ఎవ‌రైనా ఎవ‌రైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప్ర‌శ్నిస్తే అత‌ను ఉసురు తీసుకునే వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌రేమో.. అని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సైబర్ దాడి అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment