భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుకలలో ఒకటైన మహా కుంభమేళా 2025 కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుంభమేళాలో ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు రూ.2లక్షల కోట్ల ఆదాయం జనరేట్ అయినట్లుగా అంచనా వేశారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కుంభమేళాను విజయవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అంతర్జాతీయ దృష్టిలో భారతీయ సంప్రదాయ గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ మహోత్సవం, సనాతన ధర్మం విశిష్టతను ప్రపంచానికి తెలియజేసే అద్భుత ఘట్టంగా నిలిచింది. మొదట 45 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేసినప్పటికీ, ఫిబ్రవరి 14 నాటికి ఈ సంఖ్య 50 కోట్లను దాటింది. ఇప్పటికీ 12 రోజులు మిగిలి ఉండటంతో, భక్తుల సంఖ్య 55-60 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రత్యేక రోజుల్లో భక్తుల సంఖ్య
మౌని అమావాస్య – 8 కోట్ల మంది భక్తులు
మకర సంక్రాంతి – 3.5 కోట్ల మంది భక్తులు
ఫిబ్రవరి 1, జనవరి 30 – 2 కోట్లకు పైగా భక్తులు
పౌష్ పూర్ణిమ – 1.7 కోట్ల మంది భక్తులు
బసంత్ పంచమి – 2.57 కోట్ల మంది భక్తులు
మాఘి పూర్ణిమ – 2 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు.








