తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారానికి గళమెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు 24వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక ప్రకటించింది.
తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ వెంకటేశం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు సంక్షేమం కోసం పాటుపడతామని హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని ఆరోపించారు. ఆటో కార్మికులకు నెలకు రూ.12,000 వేతనం ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు ఆ పథకం అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల ఆదాయం పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.10,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. .
సమ్మెకు పిలుపునిచ్చిన సమయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌తో చర్చలు జరిపినా, నాలుగు నెలలుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆటో కార్మికులు ఆరోపిస్తున్నారు. మరి ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం స్పందిస్తుందా? లేక ఆటో కార్మికుల పోరాటం మరింత ఉధృతమవుతుందా? అనేది వేచిచూడాల్సిందే.








