బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కోపం వచ్చింది. పేపర్లలో చూసిన వార్త ఒకటి ఆయనకు తెగ చిరాకు తెప్పించిందట. దీంతో చిర్రెత్తిపోయిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై నోరుపారేసుకున్నారు. మీకు ఇష్టం అయితే ఉండండి.. లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ చిందులు తొక్కారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. దీంతో కార్మిక నేతలు తమ పోరాటానికి ఫలితమే అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. యూనియన్ నేతల ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యేకి కోపం వచ్చింది. ఆశకు అంతు ఉండాలి.. ప్యాకేజీపై అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని, కార్మికుల వల్లే ప్యాకేజీ వచ్చిందన్న వార్తను పేపర్‌లో చూసి కోపం వచ్చినంత పనైందని, అలా స్టేట్‌మెంట్లు ఇవ్వడం సరికాదన్నారు. స్టీల్ ప్లాంట్ యూనియన్ నేతలు మరియు కార్మికులు ప్యాకేజీ గురించి అవగాహన లేకుండా అవివేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్యాకేజీ మీ వల్ల కాదు, సర్కార్ వల్ల వచ్చింది
ఎమ్మెల్యే విష్ణుకుమార్ మాట్లాడుతూ ప్యాకేజీని తమ ఖాతాలో వేసుకునేలా కార్మికులు వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్లే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నామన్నారు. లాస్‌లో ఉన్న కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున సాయం చేయడం బీజేపీకి సాధ్యమైందని, చంద్రబాబు, పవన్ వల్లే ప్యాకేజీ వచ్చిందని చెప్పారు. ప్యాకేజీ మీ వల్ల వచ్చిందని అనడం తప్పు. మీకు ఇష్టమైతే పనిలో ఉండండి. లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోండి” అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.
కార్మికుల ఆగ్రహం
విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలు మండిపడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ఆందోళనలు చేపట్టి సాధించుకున్న ప్యాకేజీని తమ ఖాతాల్లో వేసుకోవడంపై మండిపడుతున్నారు. ఏనాడూ కార్మికుల ఆందోళనలకు మద్దతు తెలపని బీజేపీ.. ఇవాళ క్రెడిట్‌ను మొత్తం కూటమి ఖాతాల్లో వేయడాన్ని యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.








