ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు నాలుగుసార్లు దావోస్ వెళ్లినా ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, గత దావోస్ పర్యటనల్లో చంద్రబాబు రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చారో, ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో టీడీపీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన అంతా ప్రచార ఆర్భాటం కోసమేనని ఆరోపించారు.
మీరు చెప్పిన కంపెనీలు వచ్చాయా..?
బాబు హయాంలో ఏపీకి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రకటించినా, అవి కేవలం టీడీపీ అనుకూల మీడియా ప్రచారంగా మిగిలిపోయాయని గుర్తుచేశారు. విశాఖలో మైక్రోసాఫ్ట్, విప్రో డేటా సెంటర్, భారీ హార్డ్‌వేర్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఆంధ్రాకు అలీబాబా, గోల్డ్ రిఫైనరీ పరిశ్రమలు, హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, ఏపీకి ఎయిర్ బస్.. సీ 295 విమానాల ఉత్పత్తి కేంద్రం అని హోరెత్తించారు. రాష్ట్రంలో చైనా సంస్థ కుమియుమి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి చూపుతోందని చెప్పారు. మచిలీపట్నం, కాకినాడలో సౌదీ ఆరంకో రిఫైనరీ అన్నారు. దావోస్‌లో అడుగు పెట్టీపెట్టగానే పయనీర్ సంస్థ రూ.5 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఏపీకి వచ్చాయా..? అని పుత్తా శివశంకర్‌రెడ్డి ప్రశ్నించారు.
వైఎస్ జగన్ పరిపాలనలో వాస్తవ పరిస్థితులు..
వైఎస్ జగన్ హయాంలో ఎలాంటి హంగామా లేకుండా దావోస్ పర్యటనలో భాగంగా అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం కుదిరిందని, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ఏర్పాటు వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఓర్వకల్లు వద్ద గ్రీన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. ఇదే ప్లాంట్‌ను ఇటీవల డిప్యూటీ సీఎం సందర్శించి, ప్రాజెక్టు ఒక అద్భుతమని పొగిడారన్నారు. వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో రూ. 1.26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు, వాటిలో కొన్ని ఇప్పటికే అమలులోకి వస్తున్నాయని చెప్పారు. ఆయా కంపెనీల ద్వారా వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. స్థానికంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని పుత్తా శివశంకర్‌రెడ్డి వివరించారు.
ఆ డబ్బు ఏం చేశారు..?
రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు సాయం చేశానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్నారని, మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడు నెలల్లో రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. సూపర్ సిక్స్‌లో ప్రజలకిచ్చిన ఒక్క హామీని నెరవేర్చిందీ లేదని, మరి ఈ రూ.4 లక్షల కోట్లు ఏమైనట్లు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.







