ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ‘స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రతినెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని, పరిశ్రుభ్రత కల్చర్ అవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని పవన్ చెప్పారు. శనివారం నంబూరులో నిర్వహించిన స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్లతో కలిసి పారిశుద్ధ్య వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు పవన్. అక్కడ ఉన్న కంపోస్ట్ యంత్రాలను పరిశీలించారు.
చెత్త నుంచి సంపద సృష్టి
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని సూచించారు. చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చు అని చెప్పారు. కరోనా సమయంలో పరిశుభ్రత ప్రాధాన్యత అందరికీ తెలిసిందని గుర్తుచేశారు. పరిశుభ్రత ప్రజలందరి జీవితంలో భాగం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని పవన్ తెలిపారు. వెంటనే మార్పులు ఆశించలేమని, కానీ ప్రతిజ్ఞతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.








