తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు జేసీ. దళిత సంఘం నేతను ఫోన్లో నీ అంతు చూస్తా అంటూ బెదిరించాడు. జేసీ ఆడియో క్లిప్ ఇప్పుడు వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతోంది.
దళిత సంఘం నేత రామపుల్లయ్యకు ఫోన్ చేసిన జేసీ మీటింగ్‌కు రావాలంటూ ఎందుకు రాలేదని అడగడంతో ఈ వివాదం మొదలైంది. ఎక్కువ మాట్లాడొద్దు.. నీ కథ నేను చూస్తా అంటూ బెదిరించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. నేను పిలిస్తే రావా అంటూ రామపుల్లయ్య పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులపై సీఐ సాయి ప్రసాద్‌కు దళిత నేత రామపుల్లయ్య ఫోన్ చేసి వివరించే ప్రయత్నం చేయగా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ అడుగుతావా అంటూ తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ ఆయనపై అసభ్యకరంగా మాట్లాడాడు. సీఐ సాయి ప్రసాద్ – దళిత సంఘం నేత రామపుల్లయ్య మధ్య పరస్పర దూషణలు కొనసాగాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి, తాడిపత్రి సీఐ సాయం ప్రసాద్, దళిత నేత రామపుల్లయ్య మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరి దీనిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.








