జనసేన ఎంపీ పెత్తనాన్ని ఆ పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీ పదవులు, స్థానిక ఎన్నికల టికెట్ల విషయంలో పదే పదే జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జోక్యాన్ని జనసైనికులు భరించలేకపోతున్నారు. ఇటీవల పిఠాపురంలోనూ ఎంపీ తీరుకు వ్యతిరేకంగా జనసైనికులు రోడ్డెక్కగా, మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.
మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జనసేన నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగారు. పిఠాపురంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జోక్యంపై ఓ వర్గం జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ‘ఎంపీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం జనసేనకు చెందిన బొజ్జ వెంకటేశ్వరరావు, పిండి సంధ్య పోటీ పడ్డారు. ఈ పోటీకి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడు చక్రి కారణమంటూ ఓ వర్గం జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చక్రిపై కొందరు జనసేన నాయకులు దాడికి దిగగా, మరో వర్గం నేతలు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చక్రిని కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పిండి సంధ్యకు వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే పదవుల పంపకంపై జనసేన శ్రేణులు రోడ్డెక్కడం చర్చనీయాంశమైంది.
ఈ పరిణామాల మధ్య పిండి సంధ్య పేరును ప్రతిపాదించిన కౌన్సిలర్ ప్రభాకర్ తన ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. దీంతో బొజ్జ వెంకటేశ్వరరావు మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసినప్పటికీ, ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు జనసేనలో అంతర్గత విభేదాలను బయటపెట్టాయి. ఎంపీ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ సొంత పార్టీ కార్యకర్తలే ఆందోళనకు దిగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే జనసేన నేతలు పదవుల కోసం బహిరంగంగా తలపడటం, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూటమి రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
పిఠాపురంలో రెచ్చిపోయిన జనసైనికులుకాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు చక్రిని తరిమికొట్టిన పిఠాపురం జనసేన నాయకులు https://t.co/8uCK6QRkCu
— Telugu Feed (@Telugufeedsite) November 23, 2026








