కూటమిలో చిచ్చు.. ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం!

కూటమిలో చిచ్చు.. ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం!

Summarize with AI

మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో వార్డుల కేటాయింపు వ్యవహారం అధికార టీడీపీ, బీజేపీ మధ్య వివాదానికి దారితీసింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన వార్డుల విషయంలో గౌరవప్రదమైన సర్దుబాటు జరగలేదని కేంద్ర మంత్రి, నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల రెండో విడతలో నర్సాపురం పార్లమెంటు పరిధిలోని తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, భీమవరం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయని శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జులతో చర్చించి గౌరవప్రదమైన అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు.

భీమవరంలో పొత్తులో భాగంగా బీజేపీకి ఐదు వార్డులు కేటాయించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ సర్దుబాటుకు సిద్ధపడ్డామని, అయితే ఏయే వార్డుల్లో పోటీ చేయాలనే విషయంలో స్పష్టత ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోరిన వార్డులను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

తన ఇంటి చుట్టూ ఉన్న నాలుగు వార్డులను మాత్రమే ఖాళీగా ఉంచడంపై శ్రీనివాస్ వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా తన ఇంటి చుట్టూ ఉన్న వార్డులకే పరిమితం కావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పొత్తు లేకపోయినా ఆ వార్డుల్లో బీజేపీ విజయం సాధించగలదని ధీమా వ్యక్తం చేశారు.

ఇది వ్యక్తిగతంగా తనకు జరిగిన అవమానం కాదని, బీజేపీకి జరిగిన అవమానంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

వ్యక్తిగతంగా తాను సర్దుబాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, బీజేపీని అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని శ్రీనివాస్ వర్మ తేల్చిచెప్పారు. తాము గౌరవంతో కూడిన రాజకీయాలు చేస్తామని, ఇతరుల నుంచి కూడా అదే గౌరవాన్ని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

భీమవరంలో వార్డుల కేటాయింపు విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కూటమి పొత్తుకు అతీతంగా బీజేపీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి స్థాయిలోనే పొత్తుపై అసంతృప్తి వ్యక్తం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. భీమవరంలో బీజేపీ ఒంటరి పోరు నిర్ణయంతో కూటమి పార్టీల మధ్య వార్డుల సర్దుబాటు వివాదం మరింత చర్చనీయాంశమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment