ఎవరీ కోట రుక్మిణి?.. జ‌న‌సేన‌లో ఎందుకింత ప్రాధాన్యత?

ఎవరీ కోట రుక్మిణి?.. జ‌న‌సేన‌లో ఎందుకింత ప్రాధాన్యం?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కోట రుక్మిణి పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఆమె పేరు ప్రస్తావనకు వస్తోంది. తాజాగా జనసేన పార్టీ కార్యాలయం పేరుతో రూ.7 కోట్ల మోసం జరిగినట్లు వెలువడిన ఫిర్యాదు వివరాల్లోనూ ఆమె పేరు ప్రస్తావనకు రావడంతో అసలు కోట రుక్మిణి ఎవరు? జనసేనలో ఆమె పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎవరీ కోట రుక్మిణి?
కృష్ణా జిల్లాకు చెందిన కోట రుక్మిణి గతంలో లండన్‌లో నివసిస్తూ ప్రముఖ బ్రాండెడ్ దుకాణాన్ని నిర్వహించినట్లు ప్రచారంలో ఉంది. పవన్ కల్యాణ్‌తో పరిచయం త‌రువాత‌ జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగమైనట్లు చెబుతున్నారు. 2023లో పవన్ కల్యాణ్ వ్యక్తిగత సహాయకురాలిగా చేరినట్లు కథనాలు వెలువడ్డాయి.

జనసేనలో పవన్ కల్యాణ్‌ను కలవాలంటే రుక్మిణి అనుమతి తప్పనిసరి అనే స్థాయిలో ఆమెకు ప్రాధాన్యం ఉండేదని గతంలో ఆ పార్టీవారే కొందరు విమర్శించారు. ముఖ్యంగా జనసేన మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి తన రాజీనామా సందర్భంగా రుక్మిణి వ్యవహారశైలిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

2024లో ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం సమయంలో రుక్మిణి కనిపించారనే వార్తలు కూడా అప్పట్లో చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీలో రుక్మిణికి పవన్ కల్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు.. వారిద్దరి మధ్య ఏర్ప‌డిన స్నేహంపై గుసగుసలు సైతం వినిపించాయి.

రూ.7 కోట్ల మోసం ఫిర్యాదులో రుక్మిణి పేరు
తాజాగా జనసేన రాష్ట్ర కార్యాలయం పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసం జరిగినట్లు ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నుంచి రూ.7 కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది.

జనసేన రాష్ట్ర కార్యాలయ గుర్తులతో పాటు పార్టీ నేత శివశ్రీనివాస్, కోట రుక్మిణి పేర్లను ఉపయోగించి గగరా ధరణి అనే మహిళ మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై జనసేన నేతలు మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించినట్లు వివరాలు వెలువడ్డాయి. కానీ, ఆమె ప్రమేయం లేకుండా ఇంత పెద్ద వ్యవహారం ఎలా జరుగుతుందన్న ప్రశ్నలు ఆ పార్టీ లోని వారే సంధిస్తున్నారు.

రుక్మిణీ యూకే కంపెనీకి రూ.1.50 కోట్లు ఎలా..?
మరోవైపు రుక్మిణికి సంబంధించిన యూకేలోని కైరెన్ టెక్ కంపెనీ ఆర్థిక లావాదేవీలపైనా గతంలో సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తాయి. 2023లో పవన్ కల్యాణ్ వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా చేరిన తర్వాత ఈ కంపెనీని స్థాపించారని, 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కంపెనీకి రూ.1.50 కోట్ల నగదు ప్రవాహం నమోదైందన్న ఆధారాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి.

ఒక్క ఉద్యోగిగా మాత్రమే ఉన్నట్లు చెబుతున్న కంపెనీకి అంత మొత్తం ఎలా వచ్చిందని, పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత సహాయకురాలికి నెలకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు జీతం చెల్లిస్తున్నారా? అని నెటిజన్లు ప్రశ్నించి, నిల‌దీసిన విష‌యం తెలిసిందే.

మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ
నవంబర్ 10 నుంచి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం, తాజాగా వెలుగులోకి వచ్చిన మోసం ఫిర్యాదు నేపథ్యంలో కోట రుక్మిణి పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో విషయం ఏంటంటే పవన్ విడాకుల వ్యవహారంపై రుక్మిణి పేరు చర్చకు వస్తున్న‌ నేపథ్యంలో.. తన ప్రమేయం లేదంటూ కనీసం ఆమె ఒక ప్రకటన కూడా విడుద‌ల‌ చేయకపోవడం గమనార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment