ఏపీ డీఎస్సీ అక్రమాలపై హైకోర్టు కీలక ఆదేశాలు!

ఏపీ డీఎస్సీ అక్రమాలపై హైకోర్టు కీలక ఆదేశాలు!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం నిర్వ‌హించిన మెగా డీఎస్సీ అవ‌క‌త‌వ‌క‌ల వ్య‌వ‌హారంపై ఎంత అల‌జ‌డి సృష్టించిందో చూశాం. ఫేక్ స‌ర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటాలో న‌కిలీ ధ్రువ‌ప‌త్రాలు వంటి ఆరోప‌ణ‌లు ఏకంగా దేశం వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

కాగా, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు పేర్కొంటున్న అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు చేపట్టకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది.

డీఎస్సీ నియామకాల్లో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించాలని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.

డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని రాష్ట్ర డీజీపీని కోరినప్పటికీ స్పందన రాలేదని ఆయన న్యాయస్థానానికి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ స్పందన గురించి హైకోర్టు ప్రశ్నించింది.

పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. డీఎస్సీ నియామకాలపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment