అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ విద్యార్థినిపై రంపంతో ఉన్మాది జరిపిన దారుణ దాడి ఘటనతో పాఠశాలలో తీవ్ర భయాందోళనకర వాతావరణం నెలకొంది. తరగతి గదిలోనే చోటుచేసుకున్న ఈ భయంకరమైన ఉదంతాన్ని విద్యార్థులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. దీంతో పాఠశాలకు విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పడిపోయింది.
మ్యాథ్స్ క్లాస్ జరుగుతుండగా, ఒక్కసారిగా తరగతి గదిలోకి చొరబడిన ఉన్మాది ఎలక్ట్రిక్ రంపంతో విద్యార్థిని గోపికపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె ముఖం, గొంతు భాగాల్లో తీవ్ర గాయాలై తరగతి గదంతా రక్తపు మడుగులా మారింది. ప్రత్యక్షంగా ఈ ఘోరాన్ని చూసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి, మానసిక ఆందోళనకు గురయ్యారు. ఆ భయానక దృశ్యాలు కళ్లముందే కదలాడుతుండటంతో పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు తీవ్రంగా భయపడుతున్నారు.
పాఠశాలలో సాధారణంగా వందలాది మంది విద్యార్థులు ఉండే స్థానంలో దాడి తదనంతర భయంతో సోమవారం కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరయ్యే దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ పాఠశాలలో, అదీ ఉపాధ్యాయులు ఉన్న తరగతి గదిలోనే ఈ స్థాయిలో అక్రమార్కులు చొరబడి దాడులకు తెగబడటంపై తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతుండటంతో పాఠశాలకు పంపేందుకు వారు వెనకాడుతున్నారు.
విద్యార్థుల్లో ఆవహించిన భయాన్ని తొలగించి, వారిలో ధైర్యం నింపేందుకు విద్యాశాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. విద్యాశాఖ అధికారులు, సైకాలజిస్టులు, పోలీసులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
పాఠశాల వద్ద పోలీసు భద్రతను పెంచి, ఇకపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా నిఘా ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
సమగ్ర భద్రతా మార్గదర్శకాలను అమలు చేసి, విద్యార్థులు తిరిగి భయందోళనలు లేకుండా చదువుకునే వాతావరణాన్ని పునరుద్ధరించాలని గ్రామస్థులు, విద్యావేత్తలు కోరుతున్నారు.








