హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి, ఆర్థిక అక్రమాలపై తెలంగాణ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మల్కాజిగిరి కోర్టులో 80 పేజీల ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. హెచ్‌సీఏలో రూ.92.08 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు దర్యాప్తులో గుర్తించిన అంశాలను అధికారులు చార్జిషీట్‌లో పొందుపరిచారు. అధ్యక్షుడు ఎ. జగన్‌మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంతేల పాత్రపై పలు ఆరోపణలు ప్రస్తావించారు.
క్రికెట్ పరికరాల కొనుగోళ్లలో నకిలీ బిల్లులు, నాసిరకం బంతులను కూకాబుర్రా బ్రాండ్ పేరుతో చూపించడం, తప్పుడు రవాణా పత్రాల సృష్టి వంటి అక్రమాలు జరిగినట్లు సీఐడీ పేర్కొంది. ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో 49,628 టికెట్లకు సంబంధించిన లెక్కలు లేవని, ఈ వ్యవహారంలో రూ.14.01 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన వీఐపీ, కాంప్లిమెంటరీ పాసుల వ్యవహారంలోనూ అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడించినట్లు సమాచారం.
క్రీడాకారుల ఎంపికల్లోనూ అక్రమాలు జరిగినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అండర్-16 జట్టులో చోటు కల్పించేందుకు ఒక్కో క్రీడాకారుడి తల్లిదండ్రుల నుంచి రూ.10 లక్షల చొప్పున డిమాండ్ చేసినట్లు, 37 మంది యువ క్రికెటర్ల ఆధార్ వివరాలు, ఓటీపీలను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, ఉప్పల్ స్టేడియం అభివృద్ధి పనుల్లో టెండర్లు లేకుండా రూ.8.86 కోట్ల విలువైన కాంట్రాక్టులు కేటాయించారని, విమాన ప్రయాణ ఖర్చుల బిల్లుల్లో రూ.1.48 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సీఐడీ పేర్కొంది. ఈ ఆరోపణలపై తదుపరి దర్యాప్తు, న్యాయపరమైన చర్యలు ఎలా సాగుతాయన్నది కీలకంగా మారింది.








