సీఎం విజ‌య్‌పై టీడీపీ పొగడ్తలు.. జనసేన ఫైర్‌

సీఎం విజ‌య్‌పై టీడీపీ పొగడ్తలు.. జనసేన ఫైర్‌

Summarize with AI

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అంతర్గత పోరు సోష‌ల్ మీడియాలో నిప్పులు క‌క్కుతోంది. ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌ల ఎన్నిక సీట్ల పంచాయితీ పీక్‌లో ఉన్న స‌మ‌యంలో.. ‘విజయవాడ ఉత్సవ్’ వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై టీడీపీ నేతలు కురిపించిన ప్రశంసలు జ‌న‌సేన‌లో మ‌రో కుంప‌టిని రాజేశాయి. పవన్‌ను పరోక్షంగా దెప్పి పొడిచేలా టీడీపీ నాయకులు మాట్లాడారంటూ జనసేన శ్రేణులు మండిపడుతున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వ‌చ్చిన తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ‘విజయవాడ ఉత్సవ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజయ్‌పై ఆకాశమే హద్దుగా పొగ‌డ్త‌ల‌తో ముంచేశారు.

విజయ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ అసలుసలైన హీరో అని, పార్టీ పెట్టిన అతి తక్కువ కాలం రెండేళ్లలోనే ముఖ్యమంత్రి అయ్యారంటూ కొనియాడారు.

తమిళనాడు సీఎం విజయ్‌ను ఈ స్థాయిలో ప్ర‌శంస‌లు కురిపించ‌డం వెనుక, పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.

“పార్టీ పెట్టి పుష్కర కాలం (12 ఏళ్లు) దాటిపోయినా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ సీఎం కాలేకపోయారు.. కానీ విజయ్ మాత్రం పార్టీ పెట్టిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రి అయ్యాడు” అనే కోణంలో చంద్రబాబు, ఎంపీ చిన్ని వ్యాఖ్యలు ఉన్నాయంటూ జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ నాయకుడిని కించపరిచేలా, కావాలనే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ పెద్దలు ఈ వ్యాఖ్యలు చేశారని వారు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. దీంతో టీడీపీ యాక్టివిస్టులు సైతం ఘాటు కౌంటర్లు ఇస్తుండటంతో వివాదం ముదిరింది. “మా మద్దతు లేకుంటే పవన్ కళ్యాణ్ అసలు ఎమ్మెల్యే కూడా కాలేడు” అంటూ టీడీపీ శ్రేణులు కౌంటర్ పోస్టులు పెడుతుండటంతో కూటమిలో అసమ్మతి మరోసారి బట్టబయలైంది.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు పంచాయితీ కొలిక్కి రాక రగులుతున్న తరుణంలో.. ఈ పొగడ్తల ఎపిసోడ్ ఇరు పార్టీల క్యాడర్ మధ్య మరింత దూరాన్ని పెంచుతోంది. “నచ్చకపోతే అమ్మా అని పిలిచినా బూతు మాటగానే వినిపిస్తుంది” అన్నట్లుగా ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ – జనసేన నడుమ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment