అత్యవసర సేవలకు, ప్రాణ ఆస్తుల రక్షణకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ ఫైర్ ఇంజిన్‌ను ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తన వ్యక్తిగత బంగ్లా శుభ్రం చేసుకోవడానికి వాడుకున్న ఉదంతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. గుజరాత్‌లోని దేవ్‌గఢ్ బారియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాచూభాయ్ ఖబాద్ ఇంటిని ఫైర్ ఇంజిన్‌తో శుభ్రం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అసలు ఏం జరిగింది?
దాహోద్ జిల్లాలోని పిపేరో గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే బాచూభాయ్ ఖబాద్ నివాసానికి దేవ్‌గఢ్ బారియా ఫైర్ ఇంజిన్ సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లింది. సిబ్బంది హై-ప్రెజర్ వాటర్ హోస్ పైపులతో ఎమ్మెల్యే ఇంటి బయటి గోడలను, ప్రాంగణాన్ని కడుగుతూ కనిపించారు. అత్యవసర రక్షణ వాహనాన్ని ఇలా వ్యక్తిగత పనులకు ఉపయోగించడంపై స్థానికులు వీడియో తీసి నెట్‌లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.
ప్రజల నుండి తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవ్వడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ఫైర్ ట్యాంకర్ ప్రయాణించిన దూరానికి కిలోమీటరుకు రూ.45 చొప్పున లెక్కించి, ఎమ్మెల్యే కుమారుడు బల్వంత్ ఖబాద్ పేరు మీద రూ.2,700 రుసుము వసూలు చేసి రశీదు ఇచ్చినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారిక విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
అధికారంలో ఉన్నాం కాబట్టి చట్టాలు, నిబంధనలు తమకు వర్తించవనే భావన బీజేపీ నాయకుల్లో పెరిగిపోయిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర సమయంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే ఈ వాహనం అందుబాటులో ఉండదన్న స్పృహ కూడా లేకుండా ఇలాంటి పనులకు వాడటం దారుణమని జనం మండిపడుతున్నారు.








