దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్సీఆర్)లో(Delhi-NCR) వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజంలో మహిళల భద్రతకు (Women Safety) సంబంధించి వ్యక్తమవుతున్న తీవ్ర కలవరపాటుపై జస్టిస్ జే.బీ. పార్దివాలా(Justice J.B. Pardiwala), జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో(Justice K. Vinod Chandran) కూడిన ధర్మాసనం సుమోటోగా(Suo Motu) స్వీకరించిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
మహిళల భద్రతపై స్పందిస్తూ.. “రాత్రి 10 గంటలు లేదా 11 గంటలైనా సరే.. ఏ మహిళ అయినా భయం లేకుండా నిరభ్యంతరంగా రోడ్డుపై నడవగలిగినప్పుడే అసలైన భద్రత ఉన్నట్లు” అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నేరాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే.. అసలు నేరం జరగకుండా అడ్డుకునే బలమైన ముందస్తు వ్యవస్థను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం(Central Government), ఢిల్లీ పోలీసులకు(Delhi Police) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
నేరం జరిగిన తర్వాత విచారణలు చేపట్టడం మాత్రమే కాదని, అసలు నేరస్థులలో చట్టం పట్ల భయం కలిగించేలా కఠినమైన, బలమైన నిరోధక వ్యవస్థను నిర్మించాలని కోర్టు పేర్కొంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని చీకటి ప్రాంతాలు, పార్కులు, మెట్రో స్టేషన్లు, బస్ స్టాండ్లు, రవాణా కేంద్రాల వద్ద వెంటనే లైటింగ్, సీసీటీవీల పనితీరుపై ఆడిట్ నిర్వహించాలి. పనిచేయని కెమెరాలను (Non-Functional Cameras) వెంటనే బాగుచేయాలని ఆదేశించింది.
డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో ప్రత్యేక బృందాలను(Special Teams) ఏర్పాటు చేసి, మహిళలు మరియు పిల్లలకు (Women and Children) ప్రమాదకరంగా మారిన ప్రాంతాలను గుర్తించి, నిరంతర నిఘా పెట్టాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను(Delhi Police Commissioner) ఆదేశించింది. మహిళలు నిత్యం ప్రయాణించే మెట్రో, సబ్‌వేలు, బస్సులు, ప్రధాన రోడ్లలో రాత్రి వేళల్లో సీఆర్పీఎఫ్/పోలీస్ పెట్రోలింగ్‌ను భారీగా పెంచాలని సూచించింది.
వాహనాల విండోలపై నల్లటి స్టిక్కర్లు/టింటెడ్ ఫిల్మ్‌లు వాడటం వల్ల నేరాలు జరుగుతున్నాయని, అలాంటి వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మహిళలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీస భద్రత కల్పించడం అనేది రాజ్యాంగం అందించిన ‘జీవించే హక్కు’ (Article 21), ‘వ్యక్తిగత స్వేచ్ఛ’లో(Personal Liberty) అంతర్భాగమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
దేశ రాజధాని ప్రాంతాన్ని మహిళలకు సురక్షితమైన ప్రదేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ యంత్రాంగం మరియు పౌర యంత్రాంగాలు పటిష్టమైన జవాబుదారీతనంతో పని చేయాలని ఆదేశిస్తూ, దీనిపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది.








