తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ: కేసీఆర్

Summarize with AI

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరానికి, తెలంగాణ సోయికి చాకలి ఐలమ్మ నిలువెత్తు నిదర్శనమని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె త్యాగాలను స్మరించుకుంటూ కేసీఆర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. నాటి రాచరిక పాలనలో తెలంగాణ రైతాంగం న్యాయమైన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరవనిత ఐలమ్మ అని, అణచివేతకు గురైన సబ్బండ కులాల ఆత్మగౌరవానికి ఆమె ప్రతీకగా నిలిచారని కొనియాడారు.

నాటి భూస్వామ్య వ్యవస్థను ధైర్యంగా ఎదుర్కొని ధిక్కారాన్ని చాటడంతో పాటు, నాటి చట్టాల పరిధిలోని న్యాయస్థానాల్లోనూ పోరాడి విజయం సాధించడం ద్వారా ఐలమ్మ ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటారని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా సాగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఐలమ్మ చూపిన ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి, తెలంగాణ సోయిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తాను ప్రారంభించిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ ఐలమ్మ స్ఫూర్తి ఇమిడి ఉందని గుర్తుచేశారు.

ఐలమ్మ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని ప్రారంభించిందని కేసీఆర్ తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మహిళలు, శిశు సంక్షేమం, రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేశామని అన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ కులవృత్తులకు జీవం పోసి, సబ్బండ వర్గాల ఆర్థిక, సామాజిక ఆత్మగౌరవాన్ని పెంపొందించామని పేర్కొన్నారు. రైతాంగం, సబ్బండ కులాల అభ్యున్నతిని లక్ష్యంగా పరిపాలన సాగించడమే చాకలి ఐలమ్మకు నిజమైన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment