కొత్త పాల‌సీతో ఐటీడీపీ బ్యాచ్‌కి కాసుల పంటేనా..?

కొత్త పాల‌సీతో ఐటీడీపీ బ్యాచ్‌కి డ‌బ్బుల పంటేనా..?

Summarize with AI

ఇప్ప‌టికే 80 శాతం ప్రధాన మీడియా సంస్థ‌ల‌న్నీ చంద్ర‌బాబు నాయుడు గుప్పెట్లోనే ఉన్నాయి. ఇది జ‌న‌మెరిగిన స‌త్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రిని అడిగినా వాటి పేర్ల‌ను ట‌క్కున చెప్పేస్తారు. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌తో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌చారం చేసుకునేందుకు కూట‌మి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త పాల‌సీపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఐ-టీడీపీలో పనిచేస్తున్న వారి కోసమే ఈ పథకం తెచ్చినట్టుగా ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రంలో క‌రువు స‌హా ఇత‌ర ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌త్యేక నిధుల కేటాయింపు అంశంపై కేబినెట్‌లో చ‌ర్చించే తీరిక‌, ఓపిక లేని చంద్ర‌బాబు త‌న‌కు డ‌ప్పుకొట్టేవారికి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి డ‌బ్బులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఏపీ మంత్రివర్గం ఆమోదించిన ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌ పాలసీ’ రాజకీయ, సామాజిక వర్గాల్లో సరికొత్త ఆందోళనలకు దారితీస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం పని చేయడం కంటే ప్రచారం మీదనే ఎక్కువగా ఆధారపడుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా అభిప్రాయ వ్యక్తీకరణకు అత్యంత పారదర్శక వేదికగా భావించే డిజిటల్ రంగాన్ని కూడా ప్రభుత్వ నిధులతో ప్రభావితం చేసే ప్రయత్నాలు జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థలకే ముప్పుగా పరిణమిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మీడియా సమతుల్యత దెబ్బతింటోందా?
సాంప్రదాయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అత్యధిక భాగం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పుచేత‌ల్లోనే ఉన్నాయి. అవి చంద్ర‌బాబు అనుకూల ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలు దశాబ్దాలుగా ఉన్నాయి. వార్తల కవరేజీలో నిష్పాక్షికత లోపించి, రాజకీయ లబ్ధియే పరమావధిగా మారిన ప్రస్తుత తరుణంలో సామాన్య ప్రజలు, స్వతంత్ర విశ్లేషకులు డిజిటల్ మీడియా వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

అయితే, ఇప్పుడు ఈ డిజిటల్ వేదికలను కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు, పారితోషికాల రూపంలో నియంత్రించేందుకు విధానాలను తీసుకురావడం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతింటుందనే ఆందోళన నెలకొంది. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో ఉండే ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌ను ప్రజాధనంతో తమవైపు తిప్పుకోవడం అంటే.. సమాజంలో అసమ్మతిని, ప్రశ్నించే స్వరాన్ని పూర్తిగా అణచివేయడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు.

అధికారం – అణచివేత
ఒక వైపు తమకు అనుకూలంగా ప్రచారం చేసే సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల కోసం ప్రోత్సాహ‌కాల వ‌ల వేయ‌డం, మరోవైపు ప్రభుత్వ లోపాలను ఎండగట్టే సోషల్ మీడియా హ్యాండిళ్లపై సెన్సార్‌షిప్ విధించడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసే స్వతంత్ర ఖాతాలను, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ వేదికలను ఇండియాలోనే క‌నిపించ‌కుండా ప్ర‌భుత్వం బ్లాక్ చేయిస్తోంది.

కేవలం ఒకే రకమైన రాజకీయ దృక్పథాన్ని ప్రోత్సహిస్తూ, ప్రత్యామ్నాయ అభిప్రాయాలకు తావు లేకుండా చేయడం, మ‌రోవైపు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రశ్నించే గొంతులపై ఒత్తిడి తీసుకురావడం ఈ తరహా ద్వంద్వ వైఖరి పౌరులకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా ప్రకటన హక్కును కాలరాసే విధంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

ప్రజాధనం వినియోగమే..!
హామీల అమలు, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం కంటే ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమర్థనీయమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిజిటల్ కార్పొరేషన్లు, బ్రాండింగ్ ఈవెంట్లు, వార్తా ఛానళ్లకు ప్రకటనల రూపంలో కుమ్మరిస్తున్న కోట్లాది రూపాయల నిధులు నిజానికి ప్రజా ప్రయోజనాలకే ఖర్చు కావాల్సి ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, పేదలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పక్కనపెట్టి, ప్రజాధనాన్ని రాజకీయ ప్రచారానికి మళ్లించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. కేవలం పొగడ్తలతో నిండిన కృత్రిమ వాతావరణాన్ని సృష్టించడం వల్ల తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం కలగొచ్చేమో కానీ, అంతిమంగా అది ప్రజల్లో విశ్వసనీయతను తగ్గించడమే కాకుండా ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదకరంగా మారుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment