కొన్ని మ్యాచ్‌లు కేవలం గెలుపు, ఓటమితో ముగిసిపోవు.. తరాలు మారినా వాటి జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అలాంటి చరిత్రాత్మక మ్యాచ్ 2007 సెప్టెంబర్ 24న జరిగింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గౌతమ్ గంభీర్ (75) అద్భుత ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ వరుస వికెట్లు కోల్పోయినా.. మిస్బా ఉల్ హక్ (43) ఒంటరి పోరాటంతో మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు.
చివరి ఓవర్ వచ్చేసరికి పాకిస్థాన్ విజయానికి 13 పరుగులు అవసరం. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బంతిని జోగిందర్ శర్మ చేతికి ఇచ్చాడు. తొలి బంతి వైడ్.. ఆ తర్వాత మిస్బా కొట్టిన సిక్సర్‌తో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక నాలుగు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే కావాల్సిన సమయంలో మిస్బా స్కూప్ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేవగానే శ్రీశాంత్ ముందుకు వచ్చి పట్టిన ఆ క్యాచ్.. కోట్లాది భారత అభిమానులను ఒక్కసారిగా సంబరాల్లో ముంచెత్తింది. పాకిస్థాన్ 152 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అంతే.. ధోనీ నాయకత్వంలోని యువ భారత జట్టు తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్‌ను అందుకుంది. ఫైనల్‌లో కీలక ప్రదర్శన చేసిన ఇర్ఫాన్ పఠాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఆ మ్యాచ్ అంటే వెంటనే గుర్తొచ్చేది గంభీర్ పోరాటం, జోగిందర్ చివరి ఓవర్, మిస్బా స్కూప్, శ్రీశాంత్ క్యాచ్.. అందుకే సెప్టెంబర్ 24 భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని రోజుగా నిలిచిపోయింది.








