Election Commission: అంత‌ర్గ‌త విభేదాలా.. ఎన్నికల సంఘంలో అస‌లేం జ‌రుగుతోంది..?

Election Commission: అంత‌ర్గ‌త విభేదాలా.. ఎన్నికల సంఘంలో అస‌లేం జ‌రుగుతోంది..?

Summarize with AI

దేశ ఎన్నికల నిర్వహణకు కీలకమైన భారత ఎన్నికల సంఘం (ECI)లో అంతర్గత విభేదాలపై ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్‌లోని ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి.. గత పది నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

ఈ అభ్యంతరాలు కేవలం పరిపాలనా అంశాలకు పరిమితం కాలేదు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, తొలగించిన పేర్ల పునరుద్ధరణ, ఓటర్ల జాబితా నిర్వహణ, ఎన్నికల డేటాబేస్ భద్రత, SIR వంటి ఎన్నికల ప్రక్రియలోని కీలక అంశాలపై ఇద్దరు కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తినట్లు కథనం పేర్కొంది. కొన్ని సందర్భాల్లో తమకు సమాచారం లేదా ఆమోదం లేకుండానే ఎన్నికల సంఘం పేరుతో ఉత్తర్వులు, కమ్యూనికేషన్లు వెలువడ్డాయని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపింది.

ఫారం-6లో మార్పుపై అభ్యంతరం
కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో SIRకు సంబంధించిన కొత్త ప్రశ్నలను చేర్చడం వివాదానికి కేంద్రంగా మారింది. కొత్త ఓటరు, వారి తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేర్లు గత SIR ఓటర్ల జాబితాలో ఉన్నాయా అనే వివరాలను అడిగేలా మార్పులు చేశారు. ఈ మార్పును నిబంధనల్లో సవరణ చేయకుండా చేయలేమని వివేక్ జోషి మే నెలలో అభ్యంతరం వ్యక్తం చేయగా.. సుఖ్‌బీర్ సింగ్ సంధు కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. అనంతరం ఆగస్టు 13న సంధు ఈ మార్పును ‘అనధికారికం, చట్టవిరుద్ధం’గా పేర్కొంటూ వెంటనే తొలగించాలని కోరినట్లు కథనం వెల్లడించింది.

ఓటర్ల డేటాబేస్‌పై ఢిల్లీ నియంత్రణ?
ఓటర్ల జాబితా డిజిటల్ నిర్వహణపైనా ఇద్దరు కమిషనర్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది. సాధారణంగా నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను చట్టబద్ధమైన ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నిర్వహిస్తారు. అయితే ERONet, ECINet వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా ఓటర్ల డేటాబేస్ క్రమంగా కేంద్ర కార్యాలయం పరిధిలోకి వెళ్తోందని జోషి, సంధు ప్రశ్నించినట్లు తెలిపింది.

సంబంధిత చట్టబద్ధ అధికారులకు తప్ప మరెవరికీ ఓటర్ల డేటాబేస్‌లో మార్పులు చేసే అవకాశం లేకుండా ఆడిట్ నిర్వహించాలని వివేక్ జోషి సూచించినట్లు వెల్లడించింది. రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారులు ERONetకు పూర్తి యాక్సెస్ పొందడం లేదని సంధు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.

పశ్చిమ బెంగాల్‌లో అప్పీళ్లపై ప్రశ్నలు
పశ్చిమ బెంగాల్‌లో SIR సందర్భంగా న్యాయాధికారులు తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చిన పేర్లను సవాలు చేస్తూ ఎన్నికల సంఘం తరఫున అప్పీళ్లు దాఖలు చేయడంపైనా సంధు ప్రశ్నలు లేవనెత్తినట్లు కథనం తెలిపింది. ఈ అప్పీళ్లను ఎవరు అనుమతించారు? ఎవరి ఆదేశాలతో దాఖలు చేశారు? అనే వివరాలను ఆయన కోరినట్లు పేర్కొంది. ఈ ప్రక్రియపై తనకు, వివేక్ జోషికి, పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి సమాచారం లేదని సంధు పేర్కొన్నట్లు వెల్లడించింది.

గోవాలో 97 మంది ఓటర్లకు సాఫ్ట్‌వేర్ అడ్డంకి
ఎన్నికల డిజిటల్ వ్యవస్థపై వచ్చిన ప్రశ్నలకు గోవా ఉదంతాన్ని కూడా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తావించింది. అక్కడ 97 మంది దరఖాస్తుదారులను సంబంధిత ఎన్నికల నమోదు అధికారి అర్హులుగా గుర్తించినప్పటికీ, సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన సదుపాయం లేకపోవడంతో వారి పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేకపోయినట్లు తెలిపింది. చట్టబద్ధ అధికారి అర్హత నిర్ధారించినప్పటికీ డిజిటల్ వ్యవస్థ కారణంగా ఆ నిర్ణయం అమలు కాకపోవడం ప్రశ్నలకు దారితీసిందని పేర్కొంది.

కేబినెట్ కార్యదర్శికి ఇద్దరు కమిషనర్ల లేఖలు
ఎన్నికల సంఘం ఐటీ వ్యవస్థకు సంబంధించిన విధుల కేటాయింపుల్లో మార్పులపైనా సంధు, జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా నిర్వహణకు సంబంధించిన పర్యవేక్షణ స్థాయిని తగ్గించేలా మార్పులు జరిగాయని వారు పేర్కొంటూ కేబినెట్ కార్యదర్శికి వేర్వేరుగా లేఖలు రాసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఈ మార్పులు తమకు తెలియకుండానే జరిగాయని వారు స్పష్టం చేసినట్లు తెలిపింది.

2023 చట్టం ఏం చెబుతోంది?
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలకు సంబంధించిన 2023 చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం ఎన్నికల సంఘం వ్యవహారాలను సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా నిర్వహించాలి. కమిషనర్ల మధ్య అభిప్రాయభేదం ఉంటే మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. అయితే కమిషన్ తన పని విధానం, విధుల విభజనను నిర్ణయించుకునే విషయంలో ఏకగ్రీవ నిర్ణయం అవసరమని చట్టం పేర్కొంటోంది. ఈ నిబంధనలను ప్రస్తావిస్తూ సంధు, జోషి తమ అభ్యంతరాలను నమోదు చేసినట్లు కథనం తెలిపింది.

నాలుగు నెలల తర్వాత ముగ్గురూ సమావేశం
ఈ విభేదాల నేపథ్యంలో సెప్టెంబర్ 9న గ్యానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సమావేశమయ్యారు. నాలుగు నెలల తర్వాత ముగ్గురు కమిషనర్లు కలిసి పూర్తి స్థాయి సమావేశం నిర్వహించడం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే SIRతో సహా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే జరిగాయని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 21న ఈ అంశాలపై ఈసీకి ప్రశ్నావళి పంపినప్పటికీ, తన కథనం ప్రచురించే సమయానికి సమాధానం రాలేదని తెలిపింది.

ఈసీ పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ
ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదేపదే అధికారికంగా అభ్యంతరాలు నమోదు చేసినట్లు వెలువడిన కథనంతో ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయ ప్రక్రియ, SIR, ఓటర్ల జాబితా నిర్వహణ, డిజిటల్ డేటాబేస్ భద్రతపై చర్చ మొదలైంది. మరోవైపు ఎన్నికల సంఘం 14 అభ్యంతరాల ఉనికి, తేదీలు, విషయాలను ఖండించకుండా.. అవి నిర్ణయ ప్రక్రియలో భాగంగా చేసిన సూచనలేనని, గత ఏడాది తీసుకున్న అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయని తన స్పందనలో పేర్కొంది.

మొత్తంగా, ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ వంటి అంశాలపై ఇద్దరు కమిషనర్లు వరుసగా అభ్యంతరాలు నమోదు చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం పనితీరుపై చర్చకు ప్రధాన కారణంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment