అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సర్‌గా అభివర్ణించడంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తీవ్రంగా స్పందించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో బుధవారం ప్రసంగించిన ఆయన.. ‘‘ట్రంప్ మమ్మల్ని ఉగ్రవాదులు అన్నారు. కానీ మేము ఉగ్రవాద బాధితులం’’ అని పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయని, తమ దేశ ప్రజలు వాటికి గురయ్యారని ఆరోపించారు.
తన ప్రసంగంలో పెజెష్కియన్ ఇరాన్‌లో జరిగిన దాడుల్లో మరణించిన చిన్నారుల ఫొటోలను ప్రదర్శించారు. ముఖ్యంగా మినాబ్‌లోని పాఠశాలపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ అధునాతన ఆయుధాలతో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని, అయినప్పటికీ ఇరాన్ లొంగిపోలేదని అన్నారు.
ఇజ్రాయెల్ తమ దేశంలోని వివిధ నగరాలు, ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలకు పాల్పడుతోందని పెజెష్కియన్ ఆరోపించారు. ఇరాన్ తన ఆత్మరక్షణ కోసం పోరాడుతోందని పేర్కొంటూ.. అణు కార్యక్రమంపై తమ హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో బలప్రయోగం కాకుండా చర్చలు, దౌత్య మార్గంలో సమస్యలను పరిష్కరించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని తెలిపారు.
కాగా, పెజెష్కియన్ ప్రసంగం ప్రారంభమైన సమయంలో అమెరికా ప్రతినిధి బృందం సభా మందిరం నుంచి బయటకు వెళ్లింది. దీనికి ఒక రోజు ముందు ఐరాస వేదికగా ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే తీవ్ర సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరువైపులా పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి.








