హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని ఓ పీజీ హాస్టల్‌లో ఉంటోంది. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో విధులకు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతుండగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను పక్కకు లాగి ముద్దు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు గట్టిగా అరవడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని ఇందిరానగర్‌లోని సంతోష్ దాబాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్ (25)గా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








