కరువు నేలపై ఇవేం మాట‌లు.. లోకేష్ తీరుపై విమర్శలు

కరువు నేలపై ఏంటా మాట‌లు.. లోకేష్ తీరుపై ఆగ్రహావేశాలు

Summarize with AI

ఎల్‌నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాను కరువు పరిస్థితులు తీవ్రంగా వేధిస్తున్నాయి. నీరు లేక పంటలు ఎండిపోవడం, తాగునీటి సమస్యతో జనం గొంతుల తడి ఆరిపోతున్న దయనీయమైన పరిస్థితుల వేళ.. రాప్తాడు పర్యటనలో మంత్రి నారా లోకేష్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఏ పరిస్థితుల్లో ఎలాంటి మాటలు మాట్లాడాలనే స్పృహ‌ కూడా లేదా అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సెప్టెంబర్‌ 5 వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితులు ఖరీఫ్ సాగు, రిజర్వాయర్ల నిల్వలు, తాగునీటి లభ్యతపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాప్తాడులో పర్యటించిన లోకేష్.. బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉంటూ కరువు, తాగునీటి సమస్యల కంటే రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్య‌ల‌కే ఎక్కువగా ప్రాధాన్య‌మిచ్చార‌నే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాప్తాడులో ఎన్టీఆర్‌, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం లోకేష్ టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ‘గొడ్డలితో బతికేవారు గొడ్డలితోనే పోతారు’ అంటూ.. డీఎస్సీ అవ‌క‌త‌వ‌క‌లు గురించి, ఉద్యోగ నియామ‌కాల గురించి మాట్లాడితే ద‌బిడి దిబిడే అంటూ.. రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నాయంటూ.. ఎవ‌రినీ విడిచిపెట్టేది లేదంటూ తీవ్ర దుర్భిక్ష ప‌రిస్థితుల్లో ఉన్న ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా రాప్తాడు వేదిక మాట్లాడిన మాట‌లు రెచ్చ‌గొట్టేలా ఉన్నాయంటూ స్థానికంగా టీడీపీ నేత‌లే చ‌ర్చించుకున్నారు.

రాప్తాడు పర్యటనలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, అనేక ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటి దారుణ‌మైన క‌రువును ఎదుర్కొంటున్న‌ ప్రజలకు ఊరటనిచ్చే చర్యలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయంలో గ‌త రాజకీయ ఘర్షణలు, ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ప్రస్తావించడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. లోకేష్ చేసిన ‘గొడ్డలి’ వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఒక బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉండి ఇలా మాట్లాడ‌డంపై స్థానిక నేత‌లు, అనంతపురం ప్ర‌జ‌లు పెద‌వి విరిచారు. పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ త‌న‌కున్న ప‌ట్టును కార్య‌క‌ర్త‌ల ఎదుట‌ ప్ర‌ద‌ర్శించేందుకే లోకేష్ అలా ఉండ‌వ‌చ్చ‌ని అభివ‌ర్ణిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment