టీడీపీ(TDP) అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) వైఖరిపై ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ (Jaleel Khan) కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింల (Muslims) విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులున్న(Moneyed) వారికే ఎమ్మెల్యే(MLA), ఎమ్మెల్సీ(MLC) సీట్లు ఇస్తున్నారని విమర్శించారు. ముస్లింలకు మాత్రం చిన్నచిన్న నామినేటెడ్ పోస్టులతో(Nominated Posts) సరిపెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో ముస్లింలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని జలీల్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముస్లింలలో అసంతృప్తి ఉందని తెలిపారు. ఈ నిర్లక్ష్యానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఫలితం అనుభవించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
రాజ్యసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి కీలక పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో డబ్బున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని జలీల్ ఖాన్ ఆరోపించారు. ముస్లింలకు మాత్రం కీలక రాజకీయ అవకాశాలు ఇవ్వకుండా నామినేటెడ్ పదవులతో సరిపెడుతున్నారని విమర్శించారు.
2019 ఎన్నికల్లో తన కుమార్తె (Daughter) ఓటమికి కొందరు కుట్ర చేశారని జలీల్ ఖాన్ ఆరోపించారు. ఆమె ఓటమికి కారణమైన వారి పేర్లు తనకు తెలిసినా బయటపెట్టలేదని చెప్పారు. టీడీపీలో యాక్షన్ ఉండదని, రియాక్షన్ అంతకంటే ఉండదని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ పరంగా సమస్యలు వస్తాయని భావించి అప్పట్లో వారి పేర్లను వెల్లడించలేదని తెలిపారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) తన కుమార్తెకు మేయర్గా(Mayor) అవకాశం ఇవ్వాలని జలీల్ ఖాన్ డిమాండ్ చేశారు. సీట్ల కేటాయింపులో చంద్రబాబు వైఖరి తనకు నచ్చడం లేదని పేర్కొన్న జలీల్ ఖాన్.. పార్టీలో ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కీలక పదవులు, రాజకీయ అవకాశాల్లో ముస్లింలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించకపోతే దాని ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.







