UPI Charges: దేశంలో డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వినియోగం భారీగా పెరిగింది. టీ దుకాణాలు, కూరగాయల వ్యాపారులు, టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు చాలా మంది UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో UPI లావాదేవీలకు (UPI Transactions) సంబంధించి కొత్త ఛార్జీల విధానంపై(New Charges Policy) చర్చ జరుగుతోంది. అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని పర్సన్ టు మర్చంట్ (P2M) లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తించనున్నట్లు సమాచారం. అయితే ఈ ఛార్జీని సాధారణ వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేయరు. ప్రధానంగా వ్యాపారులు స్వీకరించే నిర్దిష్ట UPI లావాదేవీలకు సంబంధించిన చెల్లింపు వ్యవస్థలో ఈ MDR వర్తిస్తుంది.
అక్టోబర్ 15 నుంచి ఏం మారుతుంది?
కొత్త విధానం ప్రకారం.. వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే P2M UPI చెల్లింపు రూ.2,000 దాటితే 0.4 శాతం MDR వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.10,000 UPI చెల్లింపుపై 0.4 శాతం ప్రకారం రూ.40 MDR అవుతుంది. అయితే రూ.2,000 వరకు చేసే P2M చెల్లింపులకు MDR ఉండదు. అలాగే వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేసే (P2P) లావాదేవీలపైనా ఎలాంటి ఛార్జీ ఉండదు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు డబ్బు పంపడం, బిల్లులు పంచుకోవడం లేదా సొంతంగా లింక్ చేసిన బ్యాంకు ఖాతాల మధ్య నగదు బదిలీ చేసుకోవడం వంటి లావాదేవీలు ఉచితంగానే(Free)కొనసాగుతాయి.
వినియోగదారులు UPI ఛార్జీలు చెల్లించాలా?
వినియోగదారులు UPI ఉపయోగించినందుకు నేరుగా ట్రాన్సాక్షన్ ఛార్జీ (Transaction Charge) చెల్లించాల్సిన అవసరం లేదని NPCI స్పష్టం చేసినట్లు సమాచారం. రోజువారీ చిన్న మొత్తాల చెల్లింపులు చేసే వారికి కూడా ఈ మార్పుతో పెద్దగా ప్రభావం ఉండదు. రూ.2,000 వరకు చేసే P2M లావాదేవీలు MDR పరిధిలోకి రావు. రూ.2,000కు మించిన చెల్లింపుల విషయంలో కూడా MDRను వినియోగదుడి UPI యాప్‌లో ప్రత్యేక ఛార్జీగా వసూలు చేయడం ఉండదని పేర్కొంటున్నారు. అంటే UPI ద్వారా చెల్లింపు చేసే వ్యక్తిపై నేరుగా ఈ ఛార్జీ విధించరు.
రూ.75,000 దాటితే గరిష్ఠంగా రూ.300
పెద్ద మొత్తాల లావాదేవీలపై MDRకు గరిష్ఠ పరిమితిని కూడా నిర్ణయించినట్లు సమాచారం. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన నిర్దిష్ట P2M లావాదేవీపై 0.4 శాతం లెక్కించినా, వర్తించే MDR గరిష్ఠంగా రూ.300కే పరిమితం అవుతుంది. MDR అంటే మర్చంట్ డిస్కౌంట్ రేట్. డిజిటల్ చెల్లింపులను వ్యాపారులు స్వీకరించినప్పుడు చెల్లింపు వ్యవస్థకు సంబంధించిన ఫీజును MDRగా పేర్కొంటారు. సాధారణంగా క్రెడిట్, డెబిట్ కార్డు వంటి చెల్లింపు విధానాల్లో వ్యాపారులు ఇలాంటి ఛార్జీలు చెల్లిస్తుంటారు. కొత్త UPI విధానంలోనూ నిర్దిష్ట పెద్ద మొత్తాల P2M లావాదేవీలకు ఇదే తరహాలో MDR వర్తించనుంది.
మొత్తంగా ఎవరు చెల్లించాలి?
మొత్తంగా చూస్తే.. అక్టోబర్ 15 నుంచి ప్రతిపాదిత మార్పుల ప్రకారం UPI వినియోగదారులపై నేరుగా ట్రాన్సాక్షన్ ఛార్జీ విధించడం లేదు. P2P లావాదేవీలు ఉచితంగానే ఉంటాయి. రూ.2,000 వరకు వ్యాపారులకు చేసే P2M చెల్లింపులపైనా MDR ఉండదు. రూ.2,000కు మించిన P2M లావాదేవీలపై 0.4 శాతం MDR వ్యాపారి వైపు ఉన్న చెల్లింపు వ్యవస్థలో వర్తిస్తుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు MDR గరిష్ఠంగా రూ.300కు పరిమితం అవుతుంది. అయితే ఈ కొత్త విధానం అమలుకు సంబంధించిన తుది నిబంధనలు, అధికారిక మార్గదర్శకాలను సంబంధిత సంస్థలు స్పష్టం చేయాల్సి ఉంటుంది.








