తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి దివ్యాంగులు ప్రయత్నించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా బయలుదేరిన దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరుల ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు.
గన్‌పార్క్ చేరకముందే పోలీసులు ర్యాలీని నిలువరించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దివ్యాంగులను అసెంబ్లీ వైపు అనుమతించకుండా పోలీసులు అడ్డుకోగా, ఎమ్మెల్యేలను మాత్రం లోపలికి అనుమతించినట్లు బీజేపీ నేతలు తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు, ఎలాంటి హామీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, ఇల్లు లేని దివ్యాంగులకు గృహాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో అనేకం అమలు కాలేదని పాయల్ శంకర్ విమర్శించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి, ఉపాధి, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక స్వావలంబనకు మరిన్ని అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.








