ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి సుమారు 9.4 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అల్పపీడనం ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చ‌రించింది.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అల్పపీడనం ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రెండు రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

ఇప్పటికే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం కదలిక, దాని ప్రభావాన్ని బట్టి రానున్న రోజుల్లో వర్షాల తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment