తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెస్ పాలనలో పీడ దినాలు పట్టి వెయ్యి రోజులు పూర్తయ్యాయని విమర్శించారు. రైతులు ధాన్యం కుప్పలపై ప్రాణాలు కోల్పోతున్నారని, రైతు బీమాను ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కాళేశ్వరంపై ప్రభుత్వ కక్ష రైతులకు శిక్షగా మారిందని, నీళ్లు అడిగితే లాఠీలు.. ఉద్యోగాలు అడిగితే కేసులు పెడుతున్నారని విమర్శించారు.
విద్య, సంక్షేమ రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్ల పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. విద్యాసంస్థల భూముల విషయంలోనూ ప్రభుత్వం తీరును ప్రశ్నించిన కేటీఆర్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిందని, మెట్రో విస్తరణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతోందని, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ‘స్కామ్‌ల జాతర’ కొనసాగుతోందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి పనిలోనూ అవినీతి, కమీషన్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు, ప్రతిపక్ష నేతలపై కేసులతో పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే అంటున్నారని, కేసీఆర్‌కు రాజీనామాలు కొత్తేమీ కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాజీనామా చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తుచేస్తూ.. అసలు కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే రేవంత్‌రెడ్డికి సీఎం పదవి వచ్చేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.








