ఏపీలో దారుణం.. ఎక్స్‌పైర్ టాబ్లెట్లు ఇవ్వడంతో చిన్నారి మృతి!

ఏపీలో దారుణం.. టాబ్లెట్స్‌ వికటించి చిన్నారి మృతి!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య శాఖ‌ అధికారుల నిర్ల‌క్ష్యానికి అభం శుభం తెలియ‌ని చిన్నారి ప్రాణాలు గాల్లో క‌లిశాయి. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణలో భాగంగా పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు విక‌టించి ఓ విద్యార్థి మ‌ర‌ణించింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చంద్ర‌బాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై గొల్లగుప్ప గ్రామస్తుల ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. వైద్య‌ సిబ్బంది అలసత్వం వల్లే బాలిక మృతి చెందింద‌ని గ్రామస్తులు మండిప‌డుతున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం గ్రామంలో మలేరియా లక్షణాలతో ఓ బాలిక మృతి చెందడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. పరీక్షల్లో నాలుగు మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామంలోని 71 మందికి క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేశారు. అయితే మాత్రలు తీసుకున్న గంటన్నర తర్వాత పలువురు వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 54 మంది బాధితులను గుర్తించగా.. వారిలో 47 మంది చిన్నారులు ఉండటం కలకలం రేపింది.

అస్వస్థతకు గురైన వారిలో పలువురు లక్ష్మీపురం పీహెచ్‌సీలో చికిత్స పొందారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వారందరినీ మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మాత్ర‌లు విక‌టించి మడివి జమున అనే ఏడేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె మృతదేహానికి కుటుంబ సభ్యుల అంగీకారంతో అర్ధరాత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులను ఐటీడీఏ పీవో శుభం నోక్వాల్, ఏఎస్పీ బొడ్డు హేమంత్ పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మరోవైపు ఈ ఘటనపై సీపీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్లోరోక్విన్ మాత్రల పంపిణీ అనంతరం బాధితుల ఆరోగ్య పరిస్థితిని సరైన విధంగా పర్యవేక్షించకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని సీపీఎం ఆరోపించింది. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య ధోర‌ణి కార‌ణంగానే అమాయ‌క ప్ర‌జ‌లు అస్వ‌స్థ‌కు గుర‌య్యార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment