సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత

సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత

Summarize with AI

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి(Shavukaru Janaki) (94) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో(Respiratory Problems) బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Passed Away) విడిచారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానానికి నేటితో తెరపడింది.

1931 డిసెంబర్‌ 12న రాజమండ్రిలో(Rajahmundry) జన్మించిన షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ఆమె.. 18 ఏళ్లకే సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1950లో విడుదలైన ‘షావుకారు’ (Sowcar) చిత్రంతో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి సినిమానే ఆమెకు మంచి గుర్తింపు తీసుకురావడంతో ఆ సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. ఒక దశలో ఏడాదికి 20కిపైగా చిత్రాల్లో నటిస్తూ దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎదిగారు. 400కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. షావుకారు జానకి తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ వంటి అగ్ర హీరోల సరసన కథానాయికగా నటించారు. ఎన్టీఆర్‌తో ‘వద్దంటే డబ్బు’, ‘కన్యాశుల్కం’, ‘సొంత ఊరు’, ‘జయం మనదే’ వంటి చిత్రాల్లో నటించారు.

అక్కినేని నాగేశ్వరరావుతో(Akkineni Nageswara Rao) ‘రోజులు మారాయి’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘అక్కాచెల్లెళ్లు’ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘ముగ్గురు కొడుకులు’, ‘మంచి మనసులు’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచాయి.

కేవలం కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా.. వయసుకు తగ్గట్టుగా తల్లి, నానమ్మ, అమ్మమ్మ వంటి విభిన్న పాత్రల్లోనూ షావుకారు జానకి తనదైన ముద్ర వేశారు. ‘తాయారమ్మ బంగారయ్య’, ‘సంసారం ఒక చదరంగం’ వంటి చిత్రాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ‘సంసారం ఒక చదరంగం’ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకున్నారు. ‘అమూల్యం’ చిత్రానికి కూడా ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు దక్కింది.

సినీ రంగానికి ఆమె అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో షావుకారు జానకిని సత్కరించింది. 90 ఏళ్ల వయసులో పద్మశ్రీ అందుకున్న ఆమె.. తన తరానికి చెందిన అరుదైన నటీమణుల్లో ఒకరిగా నిలిచారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన షావుకారు జానకి సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. నందినిరెడ్డి దర్శకత్వంలో 2023లో విడుదలైన ‘అన్నీ మంచి శకునములే’ ఆమె చివరి తెలుగు చిత్రంగా నిలిచింది.

కథానాయికగా ప్రారంభమైన ఆమె ప్రయాణం.. సహాయ నటిగా, తల్లిగా, నానమ్మగా, అమ్మమ్మగా ఎన్నో తరాల ప్రేక్షకులను అలరించింది. ఆమె కన్నుమూయడంతో దక్షిణ భారత సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. షావుకారు జానకి మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment