రాజస్థాన్‌లోని (Rajasthan) జైపూర్‌లో(Jaipur) కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కో-కన్వీనర్ అశుతోష్ రాంకా(Ashutosh Ranka) బృందంపై దాడి జరిగింది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ పెట్టారు. సర్కారు బడులలో(Government Schools) వసతులను పరిశీలిస్తూ ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీజేపీ కీలక సభ్యుడు అశుతోష్ బృందం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లింది. బృందాన్ని స్థానికులు అడ్డుకొని దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జైపూర్ పరిధిలోని రాంపుర కన్వర్పురా గ్రామంలో(Rampur Kanwarpura) ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని తెలుసుకునేందుకు అశుతోష్ రాంకా నేతృత్వంలోని బృందం వెళ్లింది. అయితే పాఠశాలలను సందర్శించకుండా స్థానికులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో తమపై దాడి జరిగినట్లు అశుతోష్ ఆరోపించారు.
ఇటీవల ప్రభుత్వ పాఠశాలలను అనధికారిక వ్యక్తులు సందర్శించి ఫొటోలు, వీడియోలు తీయకుండా రాజస్థాన్ ప్రభుత్వం (Rajasthan Government) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. విద్యార్థుల భద్రత, గోప్యత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే అశుతోష్ రాంకా బృందం ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు వెళ్లింది. పాఠశాలల పరిస్థితిని తెలుసుకోవడం, అక్కడ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించడం తమ ఉద్దేశమని ఆయన వర్గం పేర్కొంది. అయితే రాంపుర కన్వర్పురా గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను అశుతోష్ రాంకా పరిశీలించిన సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పాఠశాలను పశువుల దొడ్డిలా నిర్వహిస్తున్నారని, విద్యార్థులకు సరైన వసతులు లేవని ఆయన ఆరోపించారు.
పాఠశాలల వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకురావడానికే తాము వెళ్లామని, అయితే స్థానికులు తమను అడ్డుకోవడంతో పాటు దాడికి పాల్పడ్డారని అశుతోష్ రాంకా ఆరోపించారు. ఈ దాడి వెనుక బీజేపీకి(BJP) చెందిన వ్యక్తులు ఉన్నారని ఆయన విమర్శించారు.








