తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సీఎం సి. జోసెఫ్ విజయ్ (CM C. Joseph Vijay) తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకు(MLAs) ప్రభుత్వం కొత్త కార్లు (New Cars) అందించడంతో పాటు.. వాహనం, డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75 వేల చొప్పున అదనపు భత్యం ఇవ్వనున్నట్లు సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అలాగే ప్రతి ఎమ్మెల్యేకు అసిస్టెంట్‌ను (Assistant) నియమించుకునేందుకు నెలకు మరో రూ.25 వేలు అందించనున్నట్లు వెల్లడించారు.
శాసనసభలో(Legislative Assembly) వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి (MLA Jyothimani) నియోజకవర్గ పర్యటనలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన రవాణా, ఇతర సౌకర్యాలపై ప్రస్తావించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలవడానికి, సమస్యలను తెలుసుకోవడానికి అవసరమైన వనరులు ఉండాలని సీఎం విజయ్ పేర్కొన్నారు.
కొత్త వాహనాలతో పాటు వాటి నిర్వహణ, డ్రైవర్ జీతం, ఇంధన ఖర్చులను దృష్టిలో పెట్టుకుని నెలకు రూ.75 వేల భత్యాన్ని ప్రభుత్వం అందించనుంది. మరోవైపు కార్యాలయ సహాయకుడిని నియమించుకుని అతడి జీతం చెల్లించేందుకు నెలకు రూ.25 వేల చొప్పున ఇవ్వనున్నారు. దీంతో ఒక్కో ఎమ్మెల్యేకు(MLA) నెలకు మొత్తం రూ.1 లక్ష మేర అదనపు సదుపాయాలు అందనున్నాయి.
సీఎం విజయ్(CM Vijay) తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సొంత వాహనాలు ఉన్న ఎమ్మెల్యేలకు కూడా కొత్త కార్లు, నెలవారీ భత్యాలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల సౌకర్యాల కోసం ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో నిరంతరం పర్యటించేందుకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వాహనాలు, సిబ్బంది అవసరమేనన్న వాదన కూడా ఉంది.
సీఎం విజయ్ ప్రకటించిన కొత్త కార్లు, రూ.75 వేల వాహన భత్యం, రూ.25 వేల అసిస్టెంట్ భత్యం తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ నిర్ణయం ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరిచే చర్యగా నిలుస్తుందా? లేక ప్రజాధనంపై అదనపు భారంగా మారుతుందా? అన్నదే చర్చనీయాంశంగా మారింది.








