నల్గొండ (Nalgonda) జిల్లాలో మహిళా ప్రిన్సిపల్ (Female Principal) దారుణ హత్య (Murder) కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. కొండమల్లేపల్లి పట్టణంలోని జేబీ కాలనీలో నివాసముంటూ నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో(Nagarjuna Public School) ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న రూపారెడ్డి(Roopa Reddy) (45) హత్య కేసులో ముగ్గురు విద్యార్థుల (Students)ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నెల 11వ తేదీన మహిళా ప్రిన్సిపల్ భర్త హైదరాబాద్‌కు (Hyderabad) వెళ్లిన సమయంలో రాత్రి రూపారెడ్డి ఇంట్లో ఉండగా ఈ దారుణం జరిగింది. రూపారెడ్డి మృతదేహాన్ని గుర్తించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు దాదాపు 80 మందిని విచారించారు. ఈ క్రమంలో కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన ముగ్గురు విద్యార్థులపై అనుమానం కలిగినట్లు తెలుస్తోంది.
రూపారెడ్డిపై నిందితులు కత్తితో(Knife) ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) సమీపంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు రూపారెడ్డి పనిచేస్తున్న అదే పాఠశాలలో పదో తరగతి (10th Class) చదువుతున్న విద్యార్థులుగా గుర్తించినట్లు సమాచారం.
ఈ కేసులో పోలీసులకు మరింత అనుమానం కలిగించిన అంశం.. హత్య అనంతరం కూడా విద్యార్థులు సాధారణంగానే పాఠశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరిస్తూ, కేసు దర్యాప్తులో జరుగుతున్న పరిణామాలను కూడా గమనించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం రూపారెడ్డి ఇంట్లో ఉన్న సుమారు రూ.4 లక్షల నగదు కూడా కనిపించకుండా పోయినట్లు సమాచారం. దీంతో నగదు కోసమే హత్య చేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు విద్యార్థుల ప్రమేయంపై పోలీసులు(Police) అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. హత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. నగదు దొంగతనం కోసమే ఈ హత్య జరిగిందా? లేక రూపారెడ్డితో వారికి ఉన్న వ్యక్తిగత లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. అదుపులో ఉన్న ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. దర్యాప్తు పూర్తయిన తర్వాత హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల ఉద్దేశం, ఘటనలో వారి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.








