కాకినాడ జిల్లాలో (Kakinada district) సంచలనం సృష్టించిన పిఠాపురం(Pithapuram) ఏఈ నూకరాజు (Nookaraju) కుటుంబం ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి వేధింపులు, బెదిరింపుల కారణంగానే తాము ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు నూకరాజు (Nookaraju) లేఖ(Letter) రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో రైఫిల్ షూటింగ్ కోచ్ (Rifle shooting coach) సాదిక్ ఖాన్‌పై (Sadiq Khan) ఆరోపణలు రావడంతో పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
కాకినాడ అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్న నూకరాజు(61) పిఠాపురం ఏఈగా(Pithapuram AE) విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య మీనా(58)(Meena), కుమార్తె సౌజన్య(Soujanya)(38), మనవడు రియాన్ష్(Riyansh)(10)తో కలిసి కారులో రాజమండ్రి (Rajahmundry) వెళ్లారు. రోడ్డు కమ్ రైలు వంతెనపై కారు నిలిపిన అనంతరం నలుగురూ గోదావరిలోకి దూకినట్లు సమాచారం. ఈ ఘటనలో నూకరాజు, మీనా, సౌజన్య మృతి చెందగా.. గోదావరిలో పడిన రియాన్ష్‌ను మత్స్యకారులు కాపాడారు.
ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నూకరాజు రాసినట్లు భావిస్తున్న లేఖ లభించింది. రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తన అల్లుడు మరణించిన అనంతరం కుమార్తెకు సహాయంగా ఉంటానంటూ సాదిక్ ఖాన్ ప్రతిపాదించాడని, అయితే తాము అందుకు అంగీకరించలేదని నూకరాజు లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ తర్వాత తనను, తన కుమార్తెను, మనవడిని చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించినట్లు తెలుస్తోంది.
తన కుమార్తెను సాదిక్ ఖాన్ (Sadiq Khan) వేధిస్తున్నాడని, ఆ వేధింపులను భరించలేక కుటుంబంతో కలిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నూకరాజు లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. తన కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ నూకరాజు తన సహోద్యోగులు, మరికొందరికి వాట్సాప్ ద్వారా లేఖ పంపినట్లు తెలుస్తోంది. తన కుటుంబాన్ని వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరినట్లు సమాచారం. లేఖ ఆధారంగా సాదిక్ ఖాన్‌పై (Sadiq Khan) పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
సాదిక్ ఖాన్ ఆచూకీ కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అతడి ఫోన్ కాల్స్, పరిచయాలు, కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నూకరాజు లేఖలో పేర్కొన్న అంశాలు, కుటుంబ సభ్యుల నేపథ్యం, సాదిక్ ఖాన్‌తో వారికి ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
కుటుంబం తీసుకున్న తీవ్ర నిర్ణయానికి అసలు కారణాలు, నూకరాజు లేఖలోని ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు పోలీసుల పూర్తి దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సాదిక్ ఖాన్ పట్టుబడితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.








