వైట్‌హౌస్ (White House) ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ (Karoline Leavitt) రాజీనామాపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. ఆమె తన కంటే తన పిల్లలనే(Children) ఎక్కువగా ప్రేమిస్తుందని ట్రంప్ (Donald Trump) సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఫాక్స్ న్యూస్ రిపోర్టర్ అలెక్సిస్ మెక్‌ఆడమ్స్‌కు (Alexis McAdams) తన కొత్త ప్రెస్ సెక్రటరీ పదవిని ఆఫర్ చేశారు. లెవిట్ రాజీనామా తర్వాత ట్రంప్ కొత్త ప్రెస్ సెక్రటరీ ఎవరు అవుతారనే దానిపై చర్చలు ముమ్మరమయ్యాయి. ఇటీవల ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ అలెక్సిస్ మెక్‌ఆడమ్స్‌కు(Alexis McAdams) ఆ పదవిని సరదాగా ఆఫర్ చేశారు.
ఇంటర్వ్యూ సందర్భం జర్నలిస్ట్ మెక్ఆడమ్స్.. కరోలిన్ లెవిట్ (Karoline Leavitt) స్థానంలో ఎవరైనా రాగలరా అని ట్రంప్‌ను అడిగారు. ట్రంప్ లెవిట్‌ను ప్రశంసించి.. ఆమె స్థానాన్ని భర్తీ చేయడం అత్యంత కష్టమని అన్నారు. ఈ సందర్భంగా రిపోర్టర్‌కు ప్రెస్ సెక్రటరీ పదవిని ఆఫర్ చేశారు. లెవిట్ నిష్క్రమణ తర్వాత వైట్ హౌస్ పోడియంపై ఎవరిని చూడాలనుకుంటున్నారని మెక్ఆడమ్స్ అడిగినప్పుడు.. ట్రంప్ వెంటనే ఆమె వైపు చూపించారు. ‘‘నువ్వా? మరి నీ సంగతేంటి?’’ అని దగ్గరలో నిలబడి ఉన్న మెక్ఆడమ్స్ పనిని ప్రశంసిస్తూ ట్రంప్ అడిగారు. ‘‘నాకు నువ్వంటే మొదటినుంచీ ఇష్టమే.’’ అని ఆమెతో చెబుతూ ఆ బాధ్యతను చక్కగా నిర్వహించగలదని ట్రంప్ అన్నారు.
కరోలిన్ లెవిట్ 2026 ఆగస్టు నెలాఖరులో తాను పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. 2026 మేలో తన రెండవ బిడ్డకు జన్మనిచ్చి, ప్రసూతి సెలవు తర్వాత జూలైలో తిరిగి విధుల్లో చేరారు. అయితే ఆమె ఇప్పుడు తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ట్రంప్ ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా ఆమె తన ముఖ్య బయటి సలహాదారులలో ఒకరిగా కొనసాగుతారని పేర్కొన్నారు.








