జార్ఖండ్‌లోని (Jharkhand) బొకారో(Bokaro) జిల్లాలో అత్యంత వింతైన, అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భూమిలో నుంచి మంటలు (Fire) చెలరేగడం ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలకు దారితీసింది. బొకారో జిల్లా, గోమియా బ్లాక్ పరిధిలోని బంధ్ పంచాయతీలో ఎడతెగని నిప్పు కణికలు నేల పొరలను చీల్చుకుంటూ బయటకు రావడాన్ని స్థానికులు గమనించారు. భూగర్భం(Underground) నుంచి మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని చూసి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ వింత ఘటనను కళ్లారా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం(Local Administration), అధికారులు అప్రమత్తమయ్యారు. భూమి కింద నుంచి అకస్మాత్తుగా మంటలు రావడానికి గల అసలు కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. జార్ఖండ్‌లోని బొకారో(Bokaro), ధన్‌బాద్(Dhanbad) వంటి ప్రాంతాలు బొగ్గు నిల్వలకు(Coal Seams) ప్రసిద్ధి చెందినవి. భూగర్భంలో ఉన్న బొగ్గు పొరల్లో లేదా సహజసిద్ధంగా ఏర్పడే గ్యాస్ లీకేజీల(Gas Leaks) వల్ల ఇటువంటి అరుదైన ప్రమాసాలు జరుగుతుంటాయని నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.








