ప్రేమ పేరుతో నమ్మించి, గర్భవతైన యువతిని కడతేర్చిన హేయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశాలో(Odisha) అదృశ్యమైన ఓ యువతి ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) విజయనగరం జిల్లాలో(Vizianagaram District) శవంగా బయటపడటం సంచలనం సృష్టించింది.
ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా సిమిలిగుడ బ్లాక్ పరిధిలో 22 ఏళ్ల యువతి అలూ మీనా (Aloo Meena) కొంతకాలంగా కనిపించకుండా పోయింది. యువతి అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన మోహన్ కిల్లో(Mohan Killo) (35)ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు.
విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు బయటకొచ్చాయి. నిందితుడు మోహన్ కిల్లో అసలు నిజం ఒప్పుకున్నాడు. బాధితురాలు మూడు నెలల గర్భవతి కావడం, ఈ విషయం కాస్తా ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారి మధ్య వివాదాలు చెలరేగాయి. దీంతో ప్రియురాలిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన నిందితుడు ఆమెను హత్య చేసినట్లు అంగీకరించాడు.
యువతిని హత్య చేసిన అనంతరం నిందితుడు మోహన్ కిల్లో ఆమె మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ సమీపంలోని టేకు చెట్ల ప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు తెలిపాడు.
నిందితుడిచ్చిన సమాచారం మేరకు ఒడిశా పోలీసులు (Odisha Police)వెంటనే గజపతినగరం స్థానిక పోలీసుల సహకారంతో ఘటనా స్థలానికి చేరుకుని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో మట్టిలో పూడ్చిపెట్టిన యువతి మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి తండ్రి ఆమె ధరించిన బట్టలు, గుర్తుల ఆధారంగా శవాన్ని గుర్తించారు.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, డీఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం నమూనాలను సేకరించారు. ఈ హత్యకు సహకరించిన మరో నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రేమ పేరుతో మోసగించి, గర్భవతని కూడా చూడకుండా యువతి ప్రాణాలు తీసిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.








