ఉచిత పథకాల అమలు, ప్రభుత్వ పాలనా తీరుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజ భవిష్యత్తు, పెరుగుతున్న ఆర్థిక భారం దృష్ట్యా ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ బీమాపాక స్పష్టం చేశారు. ఉచిత పథకాల ప్రయోజనాలను కోటీశ్వరులు సైతం పొందుతున్నారని, రైతుబంధు వంటి పథకాల వల్ల ధనికులు కూడా లబ్ధి పొందడంతో ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతోందన్నారు. ఒకప్పుడు దేశానికి మనం ఏమి చేయాలనే ఆలోచన ఉండేదని, కానీ ఇప్పుడు దేశం మనకేమిచ్చిందనే ధోరణి పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఉచిత పథకాల ప్రభావంతో గ్రామాల్లో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం కష్టంగా మారిందని, ప్రజల్లో పని చేయాలనే ఆసక్తి తగ్గుతోందని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని సూచించిన ఆయన, ప్రభుత్వ విధానాల కారణంగా ఉన్నతాధికారులు అనేక కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాపై వేల సంఖ్యలో కేసులు, వందకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదవడం విచారకరమని అన్నారు. ఇవి ఏ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు కాదని, సమాజానికి హెచ్చరికగా, ఒక పౌరుడిగా తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నానని జస్టిస్ నగేష్ బీమాపాక స్పష్టం చేశారు.








