తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి..

Summarize with AI

తెలంగాణ ఉద్యమ (Telangana Movement) స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ (Secunderabad) యశోద ఆసుపత్రిలో (Yashoda Hospital) చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రత్యేక వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గురువారం అర్ధరాత్రి 12:51 గంటలకు ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

ఈ వార్తతో బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యశోద ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని తమ ప్రియ నాయకుడికి కన్నీరుమున్నీరుగా నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతను కోల్పోయామని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి, తొలుత కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐలో పనిచేసి, అనంతరం యువజన కాంగ్రెస్, మండల, జిల్లా స్థాయిలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా కేసీఆర్(KCR) వెంట నడిచి పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్, జిల్లా అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమానికి బలమైన నాయకత్వం వహించారు. వరంగల్ మహాగర్జన సభకు అధ్యక్షత వహించడం నుంచి కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో ఉద్యమాన్ని సమన్వయం చేయడం వరకు అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో నర్సంపేటలో స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన, 2018 ఎన్నికల్లో 16,949 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజాప్రతినిధిగా సేవలందించారు.

అనంతరం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్య చురుకుగా కొనసాగిన ఆయన, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నిలబెట్టిన నాయకుడిగా రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

Join WhatsApp

Join Now

Leave a Comment