‘రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్‌ను పెకిలిస్తాం’

'రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్‌ను పెకిలిస్తాం'

Summarize with AI

రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని, దీనికి కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో వారి సమస్యలను తెలుసుకున్న ఆయన.. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తే బాధ కలుగుతోందని అన్నారు.

ఆక్వా ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయని జగన్ విమర్శించారు. కిలో ఫీడ్ ధరను రూ.14 నుంచి రూ.16 వరకు పెంచారని, తర్వాత ముష్టి వేసినట్టుగా రూ.2 తగ్గిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా? అని ప్రశ్నించారు. ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర లభించడం లేదని, ధరల పెరుగుదలకు ఎలాంటి హేతుబద్ధత లేదని మండిపడ్డారు.

ఫీడ్, సీడ్ ధరలను చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్‌గా ఏర్పడి నిర్ణయిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సిండికేట్‌లకు పూర్తి స్వేచ్ఛ లభించిందని, రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ‘అప్సడా’ (APSADA)ను ఏర్పాటు చేశామని జగన్ గుర్తు చేశారు. సీడ్, ఫీడ్, మార్కెటింగ్ అంశాల్లో సమస్యలు తలెత్తితే వెంటనే జోక్యం చేసుకుని పరిష్కరించేవాళ్లమని తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర తగ్గకుండా తమ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని జగన్ తెలిపారు. ప్రస్తుతం రొయ్యల ధరలు భారీగా పడిపోయాయని, కిలో కౌంట్ రూ.230 కూడా దాటని పరిస్థితి నెలకొందని చెప్పారు. రైతులకు సరైన ధర లభించక తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుందని, మరో మూడేళ్లు కూడా త్వరగా గడిచిపోతాయని జగన్ అన్నారు. ఆ తర్వాత రైతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆక్వా రైతుల కన్నీళ్లు తుడిచే బాధ్యత వైసీపీ తీసుకుంటుందని, చంద్రబాబు హయాంలో ఏర్పడిన సిండికేట్ వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. అప్పటి వరకు రైతుల తరఫున ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment