విశాఖలో మంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు

విశాఖలో మంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు

Summarize with AI

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఉద్రిక్త‌త‌ పరిస్థితులు నెలకొన్నాయి. బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను బాధిత కుటుంబాలు, మత్స్యకారులు రోడ్డు మీదే అడ్డుకుని తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. “మా వాళ్లను తీసుకురండి… కనీసం వారి ఆచూకీ అయినా చెప్పండి” అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

ఈనెల 4వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారింది. వేట ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఓ ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బోటు యజమాని కారి చిన్న ప్రాణాలతో బయటపడగా, అతడిని కార్గో నౌక సిబ్బంది రక్షించారు. అయితే మిగిలిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ బృందాలు మూడు రోజుల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సముద్రంలో జల్లెడ పట్టినా గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. దీంతో గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

గాలింపు చర్యలు నిలిపివేసిన నేపథ్యంలో ఆరుగురు మ‌త్స్య‌కారులు చ‌నిపోయిన‌ట్టుగా ప్ర‌క‌టించేందుకు మంత్రి విశాఖ హార్బ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు. అయితే ఆయన కాన్వాయ్‌ను మత్స్యకారులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. కనీసం తమ వారి మృతదేహాలైనా తీసుకొచ్చి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రమాదం జరిగినప్పటి నుంచి తమను పరామర్శించేందుకు ప్రభుత్వ పెద్దలు ఎవరూ రాలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం స్పందనలో తీవ్ర జాప్యం జరిగిందని మత్స్యకారులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించకుండా, దాదాపు 20 గంటల తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేపట్టారని విమర్శించారు. అదే తమ సహచరుల ప్రాణాలను కాపాడే అవకాశాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వమే తమకు అండగా నిలవకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారని బాధిత కుటుంబాలు ప్రశ్నించాయి. గల్లంతైన మత్స్యకారుల కోసం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు కొనసాగించాలని, వారి ఆచూకీపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

బోటు ప్రమాదం, గాలింపు చర్యల నిలిపివేత, అనంతరం మంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర భావోద్వేగ వాతావరణం నెలకొంది. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు ఇప్పటికీ తమ ఆత్మీయుల కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment