క‌డ‌ప రిమ్స్ డెంట‌ల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్

క‌డ‌ప రిమ్స్ డెంట‌ల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్

Summarize with AI

వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాల లేడీస్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో భోజనం చేసిన అనంతరం సుమారు 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే కడప రిమ్స్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ నెల 7వ తేదీ రాత్రి హాస్టల్‌లో విద్యార్థినులకు దోశ, చట్నీ వడ్డించారు. ఆ ఆహారం తీసుకున్న అనంతరం కొందరు విద్యార్థినులకు అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. తొలుత దాదాపు 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, ఉదయం నాటికి మరో 20 మంది ఇదే తరహా లక్షణాలతో బాధపడటంతో మొత్తం 30 మందిని ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది విద్యార్థినులను కడప రిమ్స్ జీజీహెచ్ క్యాజువాలిటీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య బృందం విద్యార్థినులకు వైద్య సేవలు అందిస్తోంది.

ఈ ఘటనపై ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ.. చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ఎవరూ ప్రమాదకర స్థితిలో లేరని, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. హాస్టల్‌లో వడ్డించిన ఆహార నమూనాలను పరీక్షలకు పంపే అవకాశమున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment