సాయికృష్ణది లాకప్ డెత్తే.. సిట్ రిమాండ్ రిపోర్టు కీల‌క అంశాలు

సాయికృష్ణది లాకప్ డెత్తే.. సిట్ రిమాండ్ రిపోర్టు కీల‌క అంశాలు

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తున్న గాదె సాయికృష్ణ అదృశ్యం, లాకప్ డెత్ ఆరోపణల కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టైన కృష్ణలంక సీఐ నాగరాజును విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (AJM) కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు సమర్పించిన వివరాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

గత నెల 8వ తేదీన సాయికృష్ణను మార్కాపురంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) ఉన్నప్పటికీ చట్టప్రకారం 24 గంటల్లో కోర్టులో హాజరుపరచకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించారు. ఇది ముమ్మాటికీ తీవ్రమైన ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్టు’ (కోర్టు ధిక్కరణ) అని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.

కస్టడీలో ఉండగానే థర్డ్ డిగ్రీ టార్చర్ కారణంగా సాయికృష్ణ మరణించాడని (Custodial Death), అనంతరం ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం సాయికృష్ణ భౌతికకాయాన్ని మాయం చేశారని సిట్ అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు.

సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకువచ్చిన ఆధారాలను, అక్కడ జరిగిన దారుణాలను దాచడం కోసం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన బ్యాకప్ సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను ఉద్దేశపూర్వకంగా పూర్తిగా డిలీట్ చేసినట్లు సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

న్యాయమూర్తి ప్రశ్న.. న్యాయవాది వివరణ
సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పోలీస్ స్టేషన్లలో 18 నెలల సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాల్సి ఉండగా, సీసీటీవీ పుటేజ్‌ను ఉద్ధేశపూర్వకంగా మాయం చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇప్పటికే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించి, బాధితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్టు సంచ‌ల‌నంగా మారింది. ఈ కేసు రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment