భారత క్రికెట్ (India Cricket) దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మరోసారి బీసీసీఐ (BCCI) ఎంపిక విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తూ ప్రతి సిరీస్‌కు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం వల్ల భారత జట్టు క్యాప్ విలువ తగ్గిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. టీమిండియాలో(Team India) స్థానం సంపాదించడం అనేది అత్యంత గౌరవప్రదమైన విషయమని, అది ప్రతిభ ఆధారంగా మాత్రమే రావాలే తప్ప మరో ఆటగాడి విశ్రాంతి కారణంగా దక్కకూడదని స్పష్టం చేశారు. భారత జట్టులోకి రావాలంటే ఆటగాళ్లు కఠినమైన పోటీని ఎదుర్కొని తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిందేనని గవాస్కర్ పేర్కొన్నారు.
అఫ్గానిస్థాన్ సిరీస్ (Afghanistan Series) సందర్భంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు (Jasprit Bumrah) విశ్రాంతి ఇవ్వడాన్ని కూడా గవాస్కర్ ప్రశ్నించారు. గాయాలు లేకపోతే అత్యుత్తమ జట్టే బరిలోకి దిగాలని, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ (Workload Management) పేరుతో తరచూ ఆటగాళ్లను పక్కన పెట్టడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఏడాది పొడవునా జరుగుతున్న నిరంతర క్రికెట్ కారణంగా ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా అలసిపోతున్నారని, అందుకే సీనియర్ క్రికెటర్లకు కనీసం నెల రోజుల పూర్తి విశ్రాంతి కల్పించాలని బీసీసీఐకి(BCCI)సూచించారు. యువ ఆటగాళ్ల అభివృద్ధి కోసం భారత్-ఏ, అండర్-19 జట్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, కానీ భారత సీనియర్ జట్టులో స్థానం మాత్రం ప్రత్యేకమైనదిగా ఉండాలని సన్నీ స్పష్టం చేశారు.








