రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. కానీ ఏపీలో(Andhra Pradesh) వ్యక్తిగత దూషణలు, శృతిమించిన బూతులు అధికమయ్యాయి. జనసేన (Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తరచూ ‘సంస్కారవంతమైన రాజకీయం, భాషా శుద్ధి’ గురించి వేదికలపై సుద్దులు చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అధినేతతో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తన చూస్తే.. ఎక్కడా పొంతన ఉండదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో (Coalition Government) భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ప్రజాప్రతినిధుల ప్రవర్తన, వారి భాషా శైలి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. “ప్రతిపక్షాలు నాపై విమర్శల దాడి చేస్తుంటే మీరు ఎందుకు నోరు విప్పడం లేదు? ఎందుకు స్పందించడం లేదు?” అంటూ తన ఎమ్మెల్యేలు, ఎంపీలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. అధినేత క్లాస్ పీకడంతో, వెంటనే జనసేన ఎమ్మెల్యే(Jana Sena MLA) పంతం నానాజీ (Pantam Nanaji) రెచ్చిపోయారు. ఏకంగా ‘వాడు, వీడు’ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్పై (Y. S. Jagan Mohan Reddy) అడ్డూఅదుపూ లేకుండా బూతులతో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కాకినాడలో మీటింగ్ పెట్టుకున్న కాపు నాయకులను ఏకంగా కుక్కలతో(Dogs) పోల్చడంపై ఆ సామాజిక వర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం వల్లే ఎమ్మెల్యేలు ఇలా బూతుల పర్వానికి తెరలేపారా అనే అనుమానం కలగక మానదు.
నానాజీ వ్యాఖ్యలపై అటు వైసీపీ(YSRCP) తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (Thota Trimurthulu) నేరుగా నానాజీకి బహిరంగ సవాల్ విసిరారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడిన భాషపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రంగా స్పందించారు. నానాజీ సంస్కారహీనంగా మాట్లాడారని మండిపడుతూ నేరుగా పోటీకి రావాలంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
“నేను నా ఎమ్మెల్సీ(MLC) పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. పంతం నానాజీ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నా మీద పోటీకి రావాలి. నేను నానాజీపై ఓడిపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటాను” అని తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే నానాజీ కంటే ఘోరంగా మాట్లాడగలనని.. కానీ సంస్కారం అడ్డు వస్తోందని అన్నారు. నువ్వు అసలు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? అంటూ నానాజీని ప్రశ్నించారు. “నేను ఓడిపోయి ఉన్న సమయంలో వైఎస్ జగన్ నన్ను పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు. కాపు కులంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను.. కాపుగానే చస్తాను” అని స్పష్టం చేశారు.
చంద్రబాబు (Nara Chandrababu Naidu) కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే, ఒక కాపు సామాజికవర్గ (Kapu Community) నేతగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి(CM) అవ్వాలని గతంలోనే తాను చెప్పానని.. జనసేన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా పవన్ను సీఎం చేయాలని అడగాలని తోట త్రిమూర్తులు హితవు పలికారు.








