రాష్ట్రంలో ఆక్వా రంగానికి (Aqua Sector) వెన్నుముకగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా రొయ్యల రైతులకు (Shrimp Farmers) ఫీడ్ తయారీ కంపెనీలు Feed Manufacturing Companies) మరోసారి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు (Shrimp Prices) పతనమై కంటిమీద కునుకులేకుండా గడుపుతున్న రైతులకు, మేత ధరలను (Feed Prices) అడ్డగోలుగా పెంచుతూ ఫీడ్ కంపెనీలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ముంచేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే కంపెనీలు దొడ్డిదారిన రొయ్యల ఫీడ్ ధరలను పెంచేస్తున్నాయంటూ ఆక్వా రైతులు (Aqua Farmers) రోడ్డెక్కుతున్నారు.
రైతుల నుంచి ఎలాంటి ముందస్తు చర్చలు లేకుండా, వారి అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఫీడ్ కంపెనీలు నేటి నుంచే పెంచిన ధరలను అమలుల్లోకి తెచ్చాయి. వనామీ రకం (Vannamei Variety) మేత కేజీపై రూ. 10 పెంపు (టన్నుకు రూ. 10,000 భారం), టైగర్ ప్రాన్ (Tiger Prawn) మేత కేజీపై రూ. 12 పెంపు (టన్నుకు రూ. 12,000 భారం).
కేవలం నెల రోజుల క్రితమే కేజీకి రూ.4 చొప్పున పెంచిన కంపెనీలు, ఇప్పుడు మళ్లీ ఇంత భారీగా రేట్లు పెంచడంపై ఆక్వా రంగం విస్తుపోతోంది. నేటి పెంపుతో మార్కెట్లో 25 కేజీల వనామీ రొయ్యల మేత బస్తా ధర రూ. 2,793కి చేరగా.. టైగర్ రొయ్య మేత బస్తా ధర రూ. 3,088కి పెరిగింది.
ప్రస్తుతం ఆక్వా సాగు పూర్తిగా నష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. పెరిగిన మేత ధరలు, మందులు, కరెంట్ ఛార్జీలతో (Electricity Charges) కలిపి ఒక కేజీ రొయ్య ఉత్పత్తి చేయడానికి రైతుకు దాదాపు రూ. 280 వరకు ఖర్చు అవుతోంది. కానీ, తీరా మార్కెట్లోకి వెళ్తే ప్రస్తుతం కేజీ వనామీ రొయ్య మార్కెట్ ధర కేవలం రూ. 240 మాత్రమే పలుకుతోంది.
పెట్టిన పెట్టుబడి (Investment) కూడా రాక, కేజీకి రూ. 40 చొప్పున నష్టపోతున్న తరుణంలో.. మేత ధరలను పెంచి రైతుల గొంతు కోస్తున్నారని ఆక్వా సంఘాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీ నేతలకు చెందిన కంపెనీలు కావడంతోనే, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలతో సంబంధం లేకుండా మొండిగా ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫీడ్ రేట్ల ఆకస్మిక పెంపుదలపై పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర ఆక్వా రైతు సంఘం (State Aqua Farmers Association) ఆధ్వర్యంలో అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పెంచిన ధరలను ఏమాత్రం అంగీకరించబోమని రైతులు తెగేసి చెప్పారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కంపెనీల మొండివైఖరిపై తదుపరి పోరాట కార్యాచరణను ప్రకటించేందుకు కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించింది. ప్రభుత్వం పెంచిన ఫీడ్ ధరలను తగ్గించేలా చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆక్వా రైతులు హెచ్చరిస్తున్నారు.








