చిన్నారి జ్ఞానేశ్వరి (Gnaneswari) మిస్సింగ్ కేసు (Missing Case) ఏపీ పోలీసులకు (AP Police) సవాల్‌గా మారింది. జ్ఞానేశ్వరి అదృశ్యమై వారం రోజులైన జాడ తెలియకపోవడంతో బాధిత తల్లిదండ్రులు (Parents) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. వందలాది మంది పోలీసులు, స్థానికులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నా ఏడో రోజు కూడా పాప ఆచూకీ లభించకపోవడంతో సంచలనంగా మారింది. చిన్నారి జాడ కోసం పోలీసులు పెంపుడు కుక్కకు ‘జీపీఎస్ ట్రాకర్’(GPS Tracker) అమర్చినా నిరాశే మిగిల్చింది.
అసలేం జరిగింది?
దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం (CH Agraharam) సమీపంలో ఉన్న ఒక యాభై ఎకరాల భారీ పామాయిల్ తోటకు గణేష్(Ganesh), భవాని (Bhavani) దంపతులు కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వారు ఆ తోటలోనే నివాసం ఉంటున్నారు. కాగా, గత శనివారం వీరి రెండేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి ఆడుకుంటూ తమ పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుంచి అడవి వైపు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కుక్క తిరిగి ఇంటికి వచ్చింది కానీ, చిన్నారి మాత్రం రాలేదు.
పాప అదృశ్యమైన సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అటవీ ప్రాంతం కావడంతో వందలాది మంది సిబ్బందితో పరిసరాలు గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క సహాయం తీసుకోవాలని పోలీసులు భావించారు. కుక్క సాధారణంగా వెళ్లిన దారిని గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి, అది మళ్లీ చిన్నారి దగ్గరకు తీసుకెళ్తుందనే ఆశతో దాని మెడకు ‘GPS Tracker’ అమర్చి అడవిలోకి వదిలారు. దాని కదలికలను ట్రాక్ చేస్తూ వెనకాలే వెళ్లారు. కానీ, జీపీఎస్ ట్రాకర్ అమర్చిన తర్వాత అది అడవి లోపలికి వెళ్లకుండా కేవలం ఇంటి పరిసర ప్రాంతాల్లోనే అటు ఇటు తిరిగి మళ్లీ వెనక్కి వచ్చేసింది. దీంతో పోలీసుల కీలక ప్రయత్నం విఫలమైంది.
ప్రస్తుతం ఆ పెంపుడు కుక్క ప్రవర్తన చాలా వింతగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దాన్ని నమ్ముకుని ముందుకు వెళ్లడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. చిన్నారి అడవిలోనే ఉందా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? వన్యమృగాలు ఏమైనా దాడి చేశాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాలను(Drone Cameras), డాగ్ స్క్వాడ్స్‌ను (Dog Squads) రంగంలోకి దించి అడవిని జల్లెడ పడుతున్నారు. ఏడు రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ దొరక్కపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాయి.








