సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

కాంగ్రెస్ (Congress) సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ రాజ్యసభ (Madhya Pradesh Rajya Sabha) ఎన్నికల అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌కు (Meenakshi Natarajan) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో(Supreme Court) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో తాము ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా(Prashant Kumar Mishra), జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్ (Atul S. Chandurkar) లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ నిబంధనలను ప్రధానంగా ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(b) ప్రకారం, ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో కోర్టులు జోక్యం చేసుకోవడంపై స్పష్టమైన నిషేధం ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. నామినేషన్ తిరస్కరణ (Nomination Rejection) వంటి అంశాలపై అభ్యంతరాలు ఉంటే, ఎన్నికలు ముగిసిన తర్వాత చట్టబద్ధంగా ‘ఎలక్షన్ పిటిషన్’ దాఖలు చేసుకోవాలే తప్ప, నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం కుదరదని స్పష్టం చేసింది.

మీనాక్షి నటరాజన్ తరఫున దేశ అత్యున్నత న్యాయవాది అభిషేక్ మను సింగ్వి (Abhishek Manu Singhvi) కోర్టులో వాదనలు వినిపించారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన వాదించారు. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసు పెండింగ్‌లో లేదు. హైదరాబాద్ (Hyderabad) కోర్టులో (Court) ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.

సదరు ప్రైవేట్ ఫిర్యాదుపై కేవలం నోటీసు మాత్రమే ఇచ్చారు తప్ప, అది క్రిమినల్ కేసు కిందకు రాదు. కాబట్టి అఫిడవిట్‌లో క్రిమినల్ కేసుల వివరాలను కావాలనే దాచారనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ చిన్న సాంకేతిక కారణాన్ని చూపుతూ నామినేషన్‌ను తిరస్కరించడం తీవ్ర అన్యాయమని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సింగ్వి పేర్కొన్నారు.

ఈ దశలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ మీనాక్షి నటరాజన్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. అయితే, భవిష్యత్తులో ఆమె ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలూ తెరిచే ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment